సీపీసీబీ(CPCB) గ్రీన్ ఫండ్స్ పై ఎన్జీటీ ముందు నివేదిక

  • ఖర్చు చేసింది 20 శాతమే 80 శాతం నిధులను ఉపయోగించలేదు

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) సేకరించిన పర్యావరణ పరిరక్షణ ఛార్జీ (ఈపీసీ), పర్యావరణ పరిహారం (ఈసీ)లో 80 శాతం ఖర్చు చేయలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ముందు బోర్డు సమర్పించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. మొత్తం కలిపి, ఈపీసీ, ఈసీ ద్వారా రూ.777.69 కోట్ల నిధులు సేకరించబడ్డాయి. ఆ నిధులలో సీపీసీబీ 20 శాతం (రూ. 156.33 కోట్లు) మాత్రమే ఉపయోగించింది. డిసెంబర్ 2023లో ట్రిబ్యునల్ ఆమోదించిన ఉత్తర్వుకు అనుగుణంగా సీపీసీబీ నివేదిక దాఖలైంది.

సీపీసీబీ అనేది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చట్టబద్ధమైన కాలుష్య నియంత్రణ పర్యవేక్షణ సంస్థ. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు నిధులు సమకూర్చడంలో సీపీసీబీ ప్రమేయాన్ని ఇతర విషయాలతోపాటు ప్రశ్నించడంతో ఎన్జీటీ ఈ రెండు నిధుల నుంచి ఖర్చు వివరాలను కోరింది. ఢిల్లీ- ఎన్ సీఆర్ లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ ఛార్జ్ నిధుల పూల్ నుంచి సీపీసీబీ ఖర్చు చేసిన రూ. 95.4 కోట్లలో సగానికి పైగా శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాల కోసం ఉపయోగించబడిందని ఎన్జీటీ ముందు దాఖలైన నివేదికలో తేలింది.