తెలంగాణలో మరో 6 పారిశ్రామిక వాడలు ప్రారంభానికి సిద్ధం

గత కేసీఆర్‌ సర్కార్‌ హయాంలో అభివృద్ధి చేసిన మరో ఆరు కొత్త పారిశ్రామిక వాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో కంపెనీలకు భూములను కేటాయించేందుకు టీఎస్‌ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది. ప్లాట్ల వివరాలు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని, ఆయా పారిశ్రామికవాడల్లో భూములు కావాల్సినవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఇదివరకే 50కి పైగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తేగా, తాజాగా మరో ఆరు పారిశ్రామిక వాడలు అందుబాటులోకి వచ్చాయి. బండి తిమ్మాపూర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌, బండమైలారం ఆగ్రో ప్రాసెసింగ్‌ పార్క్‌, తునికి బొల్లారం ఇండస్ట్రియల్‌ పార్క్‌, మహేశ్వరం ఈఎంసీ(ఎలక్ట్రానిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌), మదికొండ ఎంఎస్‌ఎంఈ టెక్స్‌టైల్‌ పార్క్‌, రావిర్యాల ఎలక్ట్రానిక్‌ సిటీ-ఇంక్యుబేషన్‌ సెంటర్‌లు ఇందులో ఉన్నాయి.