ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : ఏపీ సీఎం జగన్‌

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉగాది వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావరిపాలెం వద్ద నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనం చేసి, ఉగాది పచ్చడిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురిసి పంటలు బాగా పండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి వైపు పయనించాలని అన్నారు. ఈ వేడుకల్లో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, విసుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.