ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన పలువురు అధికారులు

లంచం తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరా ల్లోకి వెళ్తే.. హాస్పిటల్‌లో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు నల్లగొండ డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్(Drug Inspector) సోమశేఖర్‌ రూ. 18 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమశేఖర్‌కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్‌ఐ..
మరొక సంఘటనలో ఎస్‌ఐ(SI) రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్ ఎస్‌ఐ రాజ్యలక్ష్మి స్టేషన్‌ బెయిల్(Station Bail) ఇచ్చేందుకు రూ. 40 వేలు లంచం డిమాండ్‌ చేసింది. అందుకు అంగీకరించిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను కలిశాడు. వారి సూచనల మేరకు రూ.25 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హుజురాబాద్‌లో ఆర్టీసీ డిపో మేనేజర్‌
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ హుజురాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌(RTC Depot Manager) ఏసీబీకి చిక్కాడు. ఆర్టీసీ డ్రైవర్‌పై శాఖపరమైన కేసు కొట్టివేసేందుకు లంచం అడిగాడు. దీంతో చేసేదేమి లేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం ఇస్తుండగా ఎల్కతుర్తిలోని ఓ హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.