ఏపీ సీఎంపై రాయి దాడి కేసులో అనుమానితుడు అరెస్టు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ నెల 13న విజయవాడలో మేమంతా సిద్దం పేరుతో బస్సుయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌పై రాయితో దాడి చేశారు. దీంతో జగన్‌ ఎడమ కంటి కనుబొమ్మ పై భాగంలో గాయమైంది. ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమయ్యింది.

రాయితో దాడి చేసిన నిందితులను గుర్తించడంలో భద్రత వైఫల్యం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్న తరుణంలో పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా గురువారం ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న పిల్లలు ఎక్కడ ఉన్నారో వివరాలు అందించాలని కోరుతూ ఆరుగురు అనుమానితుల బంధువులు విజయవాడ కోర్టులో సర్చ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.