కాలుష్య కుమ్మరింతలు.. ఉల్లంఘనులు సర్వసాధారణమైన అంశం. గుట్టు చప్పుడుకాకుండా.. కాలుష్యాన్ని వెదజల్లడం వారికి మాత్రమే తెలిసిన విద్య. ఇంతకాలంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పరిశ్రమలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ పరిహారాన్ని విధిస్తున్నది. పర్యావరణాన్ని నాశనం చేసింనందుకు గాను ఒక కంపెనీ నుంచి రూ. 8 కోట్లు, మరో కంపెనీ రూ. 14 లక్షలు, ఇంకో కంపెనీ నుంచి రూ. 1.5 కోట్ల చొప్పున పరిహారాన్ని వసూలు చేయనున్నది. తెలంగాణలో విధించిన తొలి లెవీగా దీన్ని భావించవచ్చు. గడువులోగా పరిహారాన్ని చెల్లించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో ఎన్జీటీ హెచ్చరించింది. కాలుష్యాన్ని కుమ్మరించారనే ఆరోపణలపై ఈ మూడు పరిశ్రమలపై ఎన్జీటీ వద్ద కేసు నమోదుకాగా, దీనిని విచారించిన ఎన్జీటీ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ పీసీబీ బోర్డు ఇతర అధికారులతో కలిసి సంయుక్త కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక మేరకు ఒక్కో పరిశ్రమకు వేర్వేరుగా లెవీని విధించింది.‘పొల్యూటర్స్ టూ పే’ సూత్రాన్ని అనుసరించి కాలుష్యానికి కారకులైన వారి నుంచే ఎన్జీటీ ఈ పరిహారాన్ని వసూలు చేయనున్నది. వాయు, జలకాలుష్యం, ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థజలాలు, ఘన వ్యర్థాల ద్వారా కాలుష్యం వెదజల్లితే ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా పరిహారాన్ని వసూలు చేయనున్నది. ఉల్లంఘనలకు పాల్పడ్డ రోజు నుంచి ఎన్ని రోజులకు పాల్పడితే అన్ని రోజులకు పరిహారాన్ని వసూలు చేస్తారు. సో.. ఉల్లంఘనులు బహుపరాక్.
వేటికి విధిస్తారు..
– పరిశ్రమలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పర్యావరణాన్ని పాడుచేస్తే.. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, వాటర్ యాక్ట్ 1974,ఎయిర్ యాక్ట్ 1981ల ప్రమాణాలు మించితే.
– కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులను, ఆదేశాలను ఉల్లంఘిస్తే. ఆన్లైన్ కంటిన్యుయస్ ఎమిషన్స్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోకపోతే. పర్యావరణ పరిరక్షణకు యాక్షన్ ప్లాన్‌ను సమర్పించకపోతే.
-ఆన్లైన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినా.. కాలుష్య తీవ్రతలను మార్చేందుకు ప్రయత్నించినా, తప్పుగా నమోదుచేసినా, టాంపర్చేసేందుకు ప్రయత్నించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..
– నిబంధనలను ఉల్లంఘించి వ్యర్థజలాలను పారబోసి భూ, నీరు, వాయు కాలుష్యాలకు కారణమైతే..
– పర్యావరణ చట్టాలను పాటించకుండా, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండకుండా, ప్రమాణాలను పాటించకపోతే..
– లీకేజీలు,పొరపాట్ల వల్ల పర్యావరణానికి
హానితలపెడితే..
– ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాదకర రసాయన వ్యర్థజలాలను కుమ్మరిస్తే..
– శుద్ధిచేయని, కొంతమేర శుద్ధిచేసిన వ్యర్థజలాలను, రసాయన జలాలను పారబోస్తే
పరిహారం విధింపు.. వినియోగం ఇలా..
– పర్యావరణ పరిహారం విధింపు కోసం ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించిన 15 రోజుల్లోగా పీసీబీ ప్రాంతీయ అధికారి(ఆర్వో) పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలి.
– సెక్షన్ 31ఏ ఎయిర్ యాక్ట్ 1981, 33ఏ వాటర్ యాక్ట్ 1974ల ప్రకారం ఆర్వో సమర్పించిన నివేదికను జోనల్ అధికారి, ఉన్నతాధికారులు పరిశీలించి ఖరారుచేయాలి. దీనిని ఎక్స్టర్నల్ అడ్వయిజరీ కమిటీ, టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో చర్చింది పరిహారాన్ని ఖరారు చేయాలి.
– పర్యావరణ పరిహారం కింద లేవి విధిస్తున్నట్లుగా సంబంధిత పరిశ్రమలకు ఫైనల్ ఆర్డర్స్‌ను అందజేయాలి.
– పరిహారం కింద లెవిగా విధించిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఆయా పరిశ్రమ నిర్వాహకులను ప్రాసిక్యూట్ చేయడానికి వెనుకాడరు.
– పీసీబీలో పర్యావరణ పరిహారం డిపాజిట్ చేయడానికి వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతాను నిర్వహించాలి.
– కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం పర్యావరణ ధ్వంసంతో వాటిల్లిన నష్టాన్ని పునరుద్ధరించేందుకు లెవీని ఖర్చుచేయాలి.