అమలులోకి 144 సెక్షన్‌.. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : సీఈవో వికాస్‌రాజ్‌

తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చిందని చెప్పారు. దాంతో కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి ఉండొద్దన్నారు. 3.32కోట్ల మంది ఓటుహక్కు ఓటు వేసేలా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం పూర్తికావడంతో తదుపరి ఏర్పాట్లపై దృష్టి పెట్టామన్నారు.

ఆదివారం ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ బృందాలు బయలుదేరి వెళ్తాయన్నారు. 13న ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభమవుతుందని.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో 10,12,14 మంది ఓటర్లు ఉండగా, 13 పోలింగ్‌ కేంద్రాల్లో 25 మందిలోపు ఓటర్లు, 23 పోలింగ్‌ కేంద్రాల్లో 50లోపు ఓటర్లు ఉన్నారన్నారు.

9,900 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని.. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 12వేలమంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తున్నట్లు వివరించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ పూర్తవుతుందన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి రూ.320కోట్ల నగదు, ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీలకు సంబంధించి 8వేలకుపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి, ఎన్నికల సంబంధించి బల్క్ ఎస్‌ఎంఎస్‌లను ప్రదర్శించడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

సీ విజిల్‌, టోల్‌ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకున్నామని వివరించారు. 1.90లక్షల మంది సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటారని.. 161 కంపెనీల కేంద్ర సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలతో మొత్తం 70వేల మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించినట్లు తెలిపారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు బ్యాలెట్ యూనిట్లలో ప్రదర్శించబడే అభ్యర్థుల క్రమాన్ని తనిఖీ చేయాలని, సరైన వారిని ఎంపిక చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ స్టేషన్ వివరాలను తెలుసుకునేందుకు 1950లో ఎస్‌ఎంఎస్‌ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు.

పోలింగ్ కేంద్రాలలో అన్నికి మౌలిక వసతులను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకు 20వేల మంది ఓటర్లు హోం ఓటింగ్‌ వేశారన్నారు. 1.88లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని చెప్పారు. ప్రచార సమయం ముగిసిన తర్వాత నియోజకవర్గాల్లో ఇతరులు ఉండకూడదన్నారు. రేపు, ఎల్లుండి దినపత్రికల్లో ప్రకటలు ఇవ్వాలంటే అనుమతి తీసుకోవాలన్నారు. మే 13న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, లేకపోతే ఆయా సంస్థలపై చర్యలుంటాయని హెచ్చరించారు. జూన్‌ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుందని వివరించారు.