- కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ పొగ
- వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం
- పంటలు నష్టపోతున్నామని రైతుల ఆవేదన
- పట్టించుకోని సంబంధిత అధికారులు
షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో కాలుష్యం కోరలు చాస్తున్నది. కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ పొగ, వ్యర్థాలతో గాలి, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీంతో పంటల దిగుబడి తగ్గి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నామని స్థానికులు మండిపడుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం లేదని, కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కాలుష్య కారక కంపెనీలతో పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. షాబాద్ మండలం చందనవెల్లి గ్రామ పరిధిలోని పలు కంపెనీల నుంచి వెలువడుతున్న పొగ, కాలుష్య కారకాలతో పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. బడాబడా నేతల అందదండలు కంపెనీ నిర్వాహకులకు ఉండడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దరిదాపుల్లోకి కూడా పోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పట్టించుకోక పోవడంతో కంపెనీల నుంచి వచ్చే పొగ, ధూళి, దుమ్ము ద్వారా పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ నీటిని తాగిన పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయన్న ఆ రోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కొత్తగా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బోర్డు సభ్యులు గానీ, అధికారులు గానీ కార్యాలయానికే పరిమితం అయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిటీ సభ్యులు కార్యాలయం గడప దాటి బయటకు వస్తే జరుగుతున్న ఘోరాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రజలు, పశు పక్ష్యాదులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.