- లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు
- వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు
- ఎంత చిన్న మొత్తమైనా ఫిర్యాదు చేయండి: ఏసీబీ
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఇచ్చే లంచం ఎక్కువా… తక్కువా అని ఆలోచించొద్దని, ఎవరు లంచం అడిగినా ఫోను చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ తెలిపిన ప్రకారం… అశ్వారావుపేటకు చెందిన రైతు కొనకళ్ల జనార్దన్ తనకు మద్దికొండలో ఉన్న పొలానికి విద్యుత్తు కనెక్షన్, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం మీసేవా కేంద్రం ద్వారా రూ. లక్ష చలానా తీసి విద్యుత్తు శాఖకు చెల్లించారు. రెండు నెలలవుతున్నా అధికారులు స్పందించలేదు. మరో రూ. లక్ష లంచంగా ఇవ్వాలని ఎన్పీడీసీఎల్ ఏఈ ధరావత్ శరత్ డిమాండ్ చేశారు. దాంతో రైతు కుమారుడు ఆదిత్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈమేరకు గురువారం సాయంత్రం స్థానిక పేపరుమిల్లు సమీపంలో ఆదిత్య నుంచి ఏఈ శరత్ లంచం తీసుకుంటుండగా అప్పటికే కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
* నల్గొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీశ్ తెలిపిన ప్రకారం… రంగారెడ్డి జిల్లా హయతనగర్ మండలం ఎన్పీడీసీఎల్ ఏఈ శరత్ వనస్థలిపురానికి చెందిన రైతు రవి సూర్యనారాయణకు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లిలో వ్యవసాయ భూమి ఉంది. పొలానికి, ఇంటికి విద్యుత్తు కనెక్షన్ తీసుకోవడానికి 2022లో డీడీలు తీసి, చింతపల్లిలోని సబ్ స్టేషన్లో అందించారు. తర్వాత మల్లారెడ్డిపల్లిలో ఆర్టిజన్ గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న నడింపల్లి వేణుకుమార్ను సంప్రదించారు. కనెక్షన్ ఇచ్చేందుకు అతను రూ.50 వేల లంచం డిమాండ్ చేశారు. మొదట రూ.20 వేలు, పని ముగిశాక రూ.30 వేలు ఇవ్వాలని సూచిం చారు. అనంతరం రైతు ఏసీబీ అధికారులను ఆశ్ర యించారు. ఒప్పందం మేరకు గురువారం చింతప ల్లీలోని సాయిబాబా దేవాలయం వద్దకు వస్తే డబ్బు లిస్తానని చెప్పి వేణుకుమారి ని రైతు రప్పించారు. రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఉద్యోగిని పట్టుకున్నారు.
* మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన ప్రకారం… నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర క్యాంపు గ్రామానికి చెందిన వంగ నరేశ్… మెదక్ జిల్లా నర్సాపూర్ ఎరువుల దుకాణం ఏర్పాటు చేసేందుకు ట్రేడ్ లైసెన్సు ఇవ్వాలని ఈ ఏడాది మార్చిలో వ్యవసాయాధికారి అనిల్ కుమార్ దరఖాస్తు చేశారు. ఆర్జీని ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఆయన రూ.30 వేల లంచం అడిగారు. నరేశ్ అప్పట్లోనే ఏసీబీని సంప్రదించగా అనిల్ కుమార్ కదలికలపై నిఘా పెట్టారు. గురువారం నర్సాపూర్ లోని రైతు వేదికలో ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.