పోతారంలోఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయాలి

బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామశివారులో ఏర్పాటు చేసే ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని ఆయన కంపెనీ ప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించి, నర్సింహులపల్లి గ్రామ పంచాయతీ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, నిబంధనల ప్రకారమే పనులు కొనసాగుతాయని వివరించారు.

గ్రామశివారులో ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే వ్యవసాయ పంటలు పండవని, భూగర్భ జలాలు, గాలి కలుషితం చెంది జీవించడం కష్టంగా మారుతుందని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు. గ్రామస్తుల సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. సమావేశ అనంతరం అదనపు కలెక్టర్‌ కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకొని తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆర్డీవో రామూర్తి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీ మధు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై కృష్ణారెడ్డి, ఎంపీవో విష్ణు, అధికారులు పాల్గొన్నారు.