- అవినీతి ఆరోపణలు రావడంతో ఆకస్మిక బదిలీలు
- 3 జీఎంలు, 3 ప్రాజెక్ట్ ఆఫీసర్లపై వేటు
ప్రజల నుంచి మైనింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ శాఖపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అవినీతి అధికారులకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. దీంతో తెలంగాణ గనులు, భూగర్భ శాఖలో అవినీతి ఆరోపణలతో ఆరుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. గనుల శాఖలో డిప్యుటేషన్ పై జీఎంలుగా పనిచేస్తున్న పాండురంగారావు, దేవేందర్ రెడ్డి, ప్రశాంతి, ప్రాజెక్టు ఆఫీసర్స్ దశరథం, తోట శ్రీధర్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ లను మాతృసంస్థలకు బదిలీ చేసింది. అధికారుల అవినీతిపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంది. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ, కాళేశ్వరం అవినీతి తదితరాలపై విజిలెన్స్ విచారణలతో పాటు, సిట్ ఏర్పాటు చేసి విచారిస్తోంది. గతంలో అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలకు ఉపక్రమించేవారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ బినామీ ప్రాపర్టీ యాక్టు, మనీ లాండరింగ్ యాక్టును అమలులోకి తెచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో అవినీతికి పాల్పడుతున్న అధికారుల వివరాలు ఏసీబికి పక్కాగా చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ మూడు చట్టాలను వినియోగించుకుని ఏసీబీ కేసులను నమోదు చేసి దాడులను చేస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏసీబీకి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో దాడుల పరంపర పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమ ఆస్తులపై ఏసీబీ దూకుడును పెంచింది. ఇక కీలక శాఖల్లో అవినీతి అధికారులపై సాధారణ పరిపాలనా శాఖ అనుమతితో జాబితాను సిద్దం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఆరోపణలు సర్కార్ కు వెల్లువెత్తుతుండటంతో స్వయంగా సీఎం రేవంత్ ఏసీబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.