పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన

వరంగల్‌ -ఖమ్మం- నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్‌ ఆల్ఫాన్సెస్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సులు, పోలింగ్‌ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ఎన్నిక జరిగే 12 జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుందని, ఓటు ఎలావేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలని చెప్పారు. ఇందుకు ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పోస్టర్‌తో పాటు, ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆమె కోరారు. అనంతరం కలెక్టర్‌ పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్స్‌లు, ఇతర సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్‌, టి.పూర్ణచంద్ర, నల్లగొండ, మిర్యాలగూడ ,చండూరు, దేవరకొండ ఆర్‌డీఓలు, నాగిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్‌ ఇతర అధికారులు, తాసీల్దార్లు ఉన్నారు.