గ్రూప్‌-1 ప్రిలిమినరీ వాయిదా లేదు: టీఎస్‌పీఎస్సీ

 గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్‌పీఎస్సీ తేల్చింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పేర్కొన్నది. జూన్‌ 9నే పరీక్ష నిర్వహించేందుకు జూన్‌ 1 నుంచే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొనే విధంగా చర్యలు తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలోనే ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలు వచ్చాయి.

దీంతో గ్రూప్‌-1 కోసం దరఖాస్తులు చేసుకొన్న వారిలో నిరుద్యోగులతో పాటు ఇన్‌ సర్వీసు ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలలో తప్పనిసరిగా పాల్గొనాల్సి వచ్చింది. నిరుద్యోగులది కూడా అదే పరిస్థితి. ఎన్నికల వేళ ప్రిపేర్‌ కాలేదని, ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈక్రమంలోనే ప్రిలిమినరీ పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేసి, తమకు న్యాయం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీలను గ్రూప్‌-1 అభ్యర్థులు కోరారు.

గ్రూప్‌1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతి పత్రం అందజేశామని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్‌ తెలిపారు. గ్రూప్‌-1 పరీక్షల పేరుతో గ్రాడ్యుయేట్లను పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు వేయకుండా కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందని, ఈ విషయాన్ని గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు బిల్లు నాగరాజు యాదవ్‌, నాగేంద్రరావు, అవినాష్‌, చిలుకల రాకేష్‌ ఉన్నారు.