- రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఏసీబీ దాడులు
- ఆఫీసులు, చెక్‌పోస్టుల్లో తనిఖీలు
- వసూళ్ల కోసం కొందరికి ప్రైవేటు సైన్యం
- లారీ డ్రైవర్ల వేషంలో ఏసీబీ బృందం
- రూ.2.70 లక్షల నగదు, పత్రాలు సీజ్
- 12 ఏళ్ల తర్వాత తనిఖీలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు, చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణాశాఖపై ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం. అంతరాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారని, సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావడం లేదని ఫిర్యాదు అందాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీ ఎత్తున ఆర్టీఏ అధికారుల బదిలీలు జరిగాయని, ఈ బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో 12 ఏళ్ల తర్వాత ఏకకాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్‌పోస్టులలో తనిఖీలు చేపట్టారు.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేసి, ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న ఎంవీఐపై కేసు నమోదు చేశారు.మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరాజ్ చెక్‌పోస్ట్ దగ్గర లెక్కల్లో లేని రూ. 11 వేల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ కార్యాలయంలో 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని, పలు ఫైల్స్‌తో పాటు డబ్బులు గుర్తించారు.
మహబూబాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో ఆరుగురు ఏజెంట్లు, రవాణాశాఖ అధికారి గౌస్‌పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి రూ.45,100నగదు, డ్రైవర్ నుంచి రూ.16,500నగదు, నూతన లైసెన్సులు,రెన్యూవల్స్, ఫిట్ సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. పాలమూరు ఆర్టీఏ కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను పరిశీలించారు. ఇద్దరు ప్రైవేట్ ఏజెంట్లను, కారు అద్దెకు పెట్టి టెస్ట్ డ్రైవింగ్‌కు డబ్బులు వసూలు చేస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
సిద్దిపేట ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ సోదాలు రాత్రంతా కొనసాగాయి. డీఎస్పీ రేంజ్ అధికారితో పాటు సుమారు 15 మంది అధికారులతో కూడిన బృందం ఈ దాడుల్లో పాల్గొన్నారు. కార్యాలయంలోని కంప్యూటర్లను, రిజిస్టర్ కీలక ఫైల్స్ పరిశీలించారు. రవాణా శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న ఏజెంట్లు వారి కార్యాలయాలను మూసివేశారు. నిజామాబాద్ జిల్లా సాలూర ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి చేసి, కంప్యూటర్ ఆపరేటర్ వద్ద రూ.13,500 నగదును సీజ్ చేశారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో బృందం దాడులు చేపట్టింది. వినియోగదారుల నుంచి ఏజెంట్లు అధిక నగదు తీసుకుని ‘సీ’ ‘డీ’ లాంటి కోడింగ్‌లు స్లాట్ పత్రాలపై ఇచ్చినట్టు గుర్తించామని తెలిపారు. నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చంద్ర ఆధ్వర్యంలో దాడులు చేసి ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,500 నగదు, 50 నుంచి 60 లైసెన్స్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ చెక్‌పోస్టు వద్ద ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో కరీంనగర్ ఏసీబీ ఇన్‌స్పెక్టర్ తిరుపతి భోరజ్ చెక్‌పోస్టును ఉదయం 11 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న ఎంవీఐ యశ్వంత్ కుమార్, ఏఎంవీఐ అపర్ణ ఇద్దరు ఆర్టీవో అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భోరజ్ చెక్ పోస్టు రికార్డులను హాజరు పట్టిక, కంప్యూటర్‌లో పొందుపరుస్తున్న వాహనాల నిధులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు భోరజ్ చెక్‌పోస్టు పరిసరాలు, ఇందులో ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైన విధులు నిర్వహిస్తున్నారన్న అంశంపై ఆరా తీస్తున్నారు. ఇందులో వాహనాల ట్యాక్సుకు మించి ఉన్న రూ.11 వేలను స్వాధీనం చేసుకున్నారు.
నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంలో ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. లైసెన్స్‌ల కోసం వచ్చిన వారు బయటకు వెళ్లకుండా గేటు వేసి, వారి వద్ద సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. విచారణలో ఏజెంట్ల ద్వారా అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని డీఎస్‌పీ తెలిపారు. వాహనాలను తనిఖీ చేసే అధికారి కారుకే నెంబర్ ప్లేట్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఏసీబీ దాడుల విషయం తెలుసుకున్న పలువురు ఏజెంట్లు షాపులకు తాళాలు వేసి పరారు కాగా, ఆరుగురి ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు పని చేయకుండా ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా చేయిస్తున్నారన్నారు. ఎంవీఐ, అసిస్టెంట్ ఎంవీఐ ఆఫీస్ సిబ్బంది.. ఏజెంట్ల ద్వారా అఫీసులో లైసెన్స్‌లు, ఆర్సీలు ఇతర డాక్యుమెంట్లను చేయిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఆరుగురు ఏజెంట్లను విచారించి వారి వద్ద నుంచి రూ.12,500 నగదు, 50 నుంచి 60 లైసెన్స్‌లకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అధికారుల అశ్రద్ధతోనే కార్యాలయంలోకి ప్రైవేటు ఏజెంట్లు వచ్చి పనులు చేస్తున్నారని తెలిపారు. లైసెన్స్‌లకు సంబంధించిన మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించవలసి ఉన్నదని, వాటి పరిశీలన అనంతరం బాధ్యులైన పలువురు అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సూచించారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఏసీబీ దాడుల్లో మొత్తం రూ.2.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఈ దాడుల్లో 15 టీమ్‌లు పాల్గొన్నాయని, కేసులు నమోదు చేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
