ఆశ్చర్యంగా ఉంది..ఎందుకు ఓడించారో తెలియదు : వైఎస్‌ జగన్‌

ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఊహించని విధంగా ఫలితాలు వస్తాయని అనుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవ్వతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతన్నలు చూయించిన ఆప్యాయత, ప్రేమానురాగాలు ఫలితాల్లో (Results) ఏమయ్యోయో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలిచాలని పెన్షన్‌(Pensions) ను పెంచి అవ్వ,తాతల ఇంటి వద్దకే వెళ్లి అందజేశాం. వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. అక్క చెళ్లెలకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం. జీరో వడ్డి, ఆసరా(Aasara) , చేయూతను అందించాం, కోటి 5 లక్షల మంది అక్క చెల్లెళ్ల ప్రేమాభిమానులు ఏమయ్యాయో తెలియదని అన్నారు. పిల్లల చదువుల కోసం 12 లక్షల తల్లులు అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. 54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇచ్చాం . వీరి ఆప్యాయతా ఏమైందో తెలియదని అన్నారు.

కోట్లాది మందికి మంచి చేసినా ఎక్కడ పొరపాటు జరిగిందో ఊహించలేక పోతున్నామని జగన్‌ తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. ప్రజల కోసం మేలు జరుగాలని తాపత్రయపడ్డాం. ఎప్పుడు చూడని విధంగా మార్పులు తీసుకువస్తూ పేదలకు అండగా పనిచేశాం. గొప్ప పనులు చేసినా తరువాత వారి అభిమానం, ఆప్యాయత ఏమైందో తెలియని వివరించారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. ఓటమి నెపాన్ని ఎవరిని ప్రశ్నించమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని పేర్కొన్నారు. పేదలకు అండగా ఉంటాం . పేదల పక్షాన అసెంబ్లీ (Assembly) లో ప్రతిపక్షంగా గళం విప్పుతామని స్పష్టం చేశారు.

కూటమి నేతలకు అభినందనలు..

ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, బీజేపీ నాయకులకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండడం తమకు కొత్తేమి కాదని, రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు అనుభవించాం. అంతకన్నా కష్టాలు ఇప్పుడు పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఎదుర్కొంటామని ఆయన వెల్లడించారు.