ఎమ్మెల్సీగా నవీన్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం..

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలుపొందిన నవీన్‌ కుమార్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలోని తన చాంబర్‌లో కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పొల్గొన్నారు.

అనంతరం ఎమ్మెల్సీ నవీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు తన విజయాన్ని అంకితం చేస్తున్నాని వెల్లడించారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాలో తనను గెలిపించి పాలమూరు కేసీఆర్‌ అడ్డా అని ప్రజలు మరోమారు నిరూపించారన్నారు.

నవీన్‌ కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ అభ్యర్థిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో జరిగిన ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 2న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిపై మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘన విజయం సాధించారు.