- చీటింగ్ కేసు నుంచి బయటపడేసేందుకు మొత్తం రూ.15 లక్షల లంచం డిమాండ్
- అడ్వాన్స్ గా రూ.5 లక్షలు తీసుకున్న సీఐ
- రూ.3 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత
- హైదరాబాద్ సీసీఎస్ లో మరో అవినీతి చేప
చీటింగ్ కేసు నుంచి నిందితుడిని తప్పించేందుకు రూ.3 లక్షల లంచం తీసుకుంటూ హైదరాబాద్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. బషీర్ బాగ్ లోని ఓల్డ్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదురుగా పార్కింగ్ స్థలంలో గురువారం బాధితుల నుంచి డబ్బులు ఉన్న బ్యాగ్ ను అందుకున్న ఇన్స్పెక్టర్.. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకొని ఆ బ్యాగ్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు. అధికారులు ఛేజ్ చేసి సీఐని పట్టుకున్నారు. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు కేసును మరువకముందే, మరో ఇన్స్పెక్టర్ భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ పట్టుబడటం గమనార్హం. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం… ఆర్థిక నేరాల కేసులను దర్యాప్తు చేసే సీసీఎస్ లోని టీమ్-7 ఇన్స్పెక్టర్ గా చామకురి సుధాకర్ ఉన్నాడు. క్రైమ్ నంబర్ 41/2024కు సంబంధించిన చీటింగ్ కేసు దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నాడు. యాప్రాల్ కు చెందిన వ్యాపారి సీవీఎస్ సత్యప్రసాద్ వ్యాపార విస్తరణ కోసం తన డూప్లెక్స్ ఇంటిని అమ్మే విషయంలో బోయిన్ పల్లికి చెందిన మని రంగస్వామి, హేమ సుందర్ రెడ్డి తనను రూ.1.48 కోట్లు మోసం చేశారంటూ సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను ఉన్నతాధికారులు సుధాకర్ కు అప్పగించారు. నిందితుడైన మని రంగస్వామిని ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్స్ ఇప్పటికే రూ.5 లక్షల లంచం తీసుకున్నాడు.
మిగతా సొమ్ము ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడంతో రంగస్వామి ఏసీబీని ఆశ్రయించాడు. ఒప్పందంలో భాగంగా రంగస్వామి రూ.3 లక్షల లంచం గురువారం ఇస్తానంటూ సుధాకర్ కు హామీ ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రూ.3 లక్షల నోట్ల కట్టలు బ్యాగ్ పెట్టుకొని రంగస్వామి బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ స్థలానికి చేరుకున్నాడు. రంగస్వామి ఫోన్ చేయగానే సుధాకర్ అక్కడకు వచ్చి లంచం డబ్బులు ఉన్న బ్యాగ్‌ను తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా ఇన్స్పెక్టర్ ను పట్టుకున్నది. అధికారులను వదిలించుకొని ఆ నగదు బ్యాగ్ ను అక్కడే వదిలేసి సుధాకర్ పరారయ్యాడు. వెంటనే ఏసీబీ ఇన్స్పెక్టర్ సతీశ్, కానిస్టేబుళ్లు మున్నా, గోవిందనాయక్, హరికాంత్ రెడ్డి.. సుధాకర్ ను వెంటపడి ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. లంచం డబ్బులు ఉన్న బ్యాగ్ ను రికవరీ చేసి చేతివేళ్లను కెమికల్ పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. సుధాకర్ ను అరెస్టు చేసి, లంచం డబ్బులు రికవరీ చేశారు.