- నిత్యం కాలుష్యంతో సహవాసం చేస్తున్న ప్రజలు
- ఘాటైన వాసనలతో కళ్ల మంటలు
- చిన్నారులకు చిన్న నాటి నుంచే కంటి సమస్యలు
- గాలి కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు
- కాలుష్య కాసారంగా మారిన చెరువులు,కుంటలు
- బోర్లు వేస్తే రంగుమారిన నీటి దర్శనం
- నిద్రమత్తులో పీసీబీ
- ఉద్యమం మొదలెట్టిన ఖాజీపల్లి ప్రజలు
- ఖాజీపల్లిని కాపాడాలంటూ కలెక్టర్కు వేడుకోలు
నిద్రలేచింది మొదలు ఆ గ్రామస్తులు కాలుష్యంతోనే సహవాసం చేయాలి.. పీల్చుకునే గాలితో పాటు వాడుకునే నీరు కాలుష్యమే.. బ్రతకడానికి పీల్చుకునే గాలి కూడా కాలుష్యం కావడంతో ఆ గ్రామంలో ఎందరికో శ్వాసకోశ సమస్యలు, అలాగే వాడుకునే నీటి కారణంగా చర్మ వ్యాధుల సమస్యలు, కంటి సమస్యలు.. ఇవన్నీ ఆ గ్రామం చుట్టూ ఉన్న రసాయన పరిశ్రమల బరితెగింపు కారణంగా గ్రామస్థులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఆ గ్రామమే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపల్లి గ్రామం.. కాలుష్యంతో వేగలేక గ్రామస్తులు ఇక ఉద్యమ బాట పట్టారు.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు తమను పట్టించుకోరని ఉద్యమిస్తేనే తమ సమస్యలు తీరుతాయని పోరుబాటపట్టారు. రమాకాంత్ అనే యువకుడి ద్వారా ప్రేరణ పొందిన ప్రజలు కాలుష్య కారకంపై ఉద్యమించారు..
పఠాన్ చెరు నియోజకవర్గ పరిధి జిన్నారం మండల౦లోని కాజీపల్లి, గడ్డపోతారం, అలీనగర్, కిష్టయ్య పల్లి, గండిగూడెం, బొంతపల్లి తదితర గ్రామాల్లో కాలుష్య రక్కసి విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాలు కాలుష్య కాలకూట విషాన్ని చిమ్ముతున్నాయి.. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలోని బొల్లారం, కాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి గ్రామాలు కాలుష్య తాండవంతో ఆయా గ్రామాల ప్రజల జీవన స్థితిగతులు తిరోగమనంలో కొట్టు మిట్టాడుతున్నాయి.. ఎందరిలోనో ఆరొగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. చాలా మందికి శ్వాసకోశ వ్యాధులు, కంటి చూపు సమస్య, చర్మ వ్యాధులు వ్యాపించి ఇబ్బంది పడుతున్నారు.. బాధితులకు రోగాలు రావడం కేవలం నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వేదజల్లుతున్న, నిబంధనలకు విరుద్ధoగా వ్యర్థ రసాయనాలను పరిశ్రమల నుండి చెరువులు, కుంటల్లోకి మల్లిస్తున్నది రసాయన పరిశ్రమలేనని చెప్పాలి..
ఖాజీపల్లి గ్రామానికి చెందిన రమాకాంత్ అనే యువకుడు ఇటీవలే విదేశాల నుండి సొంత గ్రామానికి వచ్చాడు.. గ్రామం చుట్టూ ఉన్న రసాయన పరిశ్రమల కారణంగా కాలుష్య౦తో నిండిపోయిన వాతావరణాన్ని చూసి చాలించి ఎలా జీవిస్తున్నారని గ్రామస్తులను ప్రశ్నించి మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నాడు..తన ప్రాంతం బాగుపడటానికి సొంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని గ్రామస్థులకు కాలుష్యం వల్ల కలిగే అనర్ధాలు, వాటి వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరిస్తూ ఆయా పరిశ్రమలను ఎలా కట్టడి చేయాలో గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాడు.. రమాకాంత్ సహకారంతో ఒక్కటైన గ్రామస్థులు బ్యానర్లు చేతబట్టి కాలుష్యాని వేదజల్లుతున్న కెమికల్ కంపెనీలకు వ్యతిరేకంగా ఊరంతా తిరిగి నిరసన ప్రదర్శనలు చేశారు.. రసాయన కంపెనీలను మూసివేయించాలని డిమాండ్ చేశారు.. మరో చోటికి తరలించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని, కాలుష్యంగా మరిన గాలి, నేల, నీటిని కాపాడాలని నినదించారు..
తన సొంత గ్రామంలో కాలుష్యా నికి గురై నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులను కాపాడేందుకు కెనడా నుంచి నేరుగా కాజీపల్లికి వచ్చాడు ఓ శ్రీమంతుడు. రాగానే స్థానిక సమస్యలను కల్లారా చూసి చల్లించిన ఆ యువకుడు ఎలాగైనా సరే కాలుష్యాన్ని గ్రామం నుంచి రూపుమాపాలని కంకణ బద్ధుడయ్యాడు. రసాయన పరిశ్రమలను గ్రామం నుంచి తరలించేందుకు విశ్వప్రయత్ననికి పూనుకున్నాడు. ఏకంగా గ్రామస్తులతో కాలుష్యంపై జేఏసీని ఏర్పాటు చేసి విధివిధానాలను రూపకల్పన చేశాడు. గ్రామస్తులను చైతన్యపరిచేందుకు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాలుష్యంపై డోర్ టు డోర్ అవగాహన కల్పించాడు. యువకుడు రమాకాంత్ దండే.
నిద్రమత్తులో పీసీబీ..
జన్నారం మండలంలోని కాజీపల్లి, గడ్డపోతారం, అలీనగర్, కిష్టయ్యపల్లి, గండిగూడెం, బొంతపల్లి తదితర గ్రామాలు కాలుష్య తాండవంతో ఇబ్బంది పడుతున్నాయంటే దీనికి కారణం పీసీబీ నిర్లక్షమేనని చెప్పాలి.. నిబంధనలు పాటించకపోవడం గాలిలో విషతుల్యమైన ఘాటైన రసాయనాలను విడుదల చేయడం, వ్యర్థ రసాయనాలను నిబంధనల మేరకు జెఈటిఎల్ కు పంపించకుండా చెరువులు, కుంటల్లోకి విడుదల చేస్తున్నాయి.
కాలుష్య విలయంలో ఖాజీపల్లి దండే రమాకాంత్..
నేను కెనడాలో సెటిలయ్యాను.. సంపాదన చాలు ఇక గ్రామంలో తల్లిదండ్రులతో పాటు గడపాలనే నిర్ణయంతో స్వగ్రామమైన ఖాజీపల్లికి వచ్చాను.. తీరా చూస్తే ఇక్కడ పూర్తిగా పొల్యూషనే. పీల్చుకునే గాలి, అవసరాలకు వాడుకునే నీరు కూడా కాలుష్యమైతే ఎలాజీవించాలి.. పరిశ్రమల కారణంగా గ్రామంలో చాలా మందికి వివిధ రకాల రోగాలు వెంటాడుతున్నాయి. ఇలా అయితే ఆరో గ్యకరమైన జీవన విధానాన్ని ఎలా పొందగలం.. అందుకే రసాయన పరిశ్రమలను జిన్నారం మండలం నుండి తరలించి నివాసయోగ్యానికి దూరంగా తరలించాలని ఉద్యమిస్తున్నాం.. కాజీపల్లి గ్రామం నేడు.. ఏరులై పారుతున్న కాలుష్యంతో విలవిలలాడుతోంది. చెట్టు చేమ చెరువులు కుంటలు వాగు వంకలు కాలుష్యంతో నిండిపోతు కనుమరుగవుతున్నాయి. ఈ దుస్ధితిని రూపుమాపే వరకు గ్రామస్తులకు అండగా ఉంటా పోరాడుతా.