ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగానూ పవన్‌ బాధ్యతలు చేపట్టారు.

డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ కల్యాణ్‌ తొలిసారిగా మంగళవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు, మహిళలు, కూటమి నాయకులు, ఉద్యోగులు పవన్‌ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికారు. సచివాలయానికి చేరుకున్న పవన్‌కు సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఇద్దరూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ భద్రతను కూడా ఏపీ ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. వై ప్లస్‌ సెక్యూరిటీతో పాటు బుల్లెట్‌ప్రూఫ్‌ కారును కేటాయించారు.