- పుడమి కాలుష్యమయం
- విపరీతమైన కాలుష్యం చేస్తున్న పరిశ్రమలు
- పర్యావరణాన్ని దెబ్బతిస్తున్న ప్లాస్టిక్
- పట్టించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. కొండలను ధ్వంసం చేస్తున్నాం. చెట్లను నరికి వేస్తున్నాం. చెరువులను కాలువలను మింగేశాం. అడవులను విద్వంసం చేశాం. వన్యప్రాణులను మింగేశాం. భూమిని, గాలిని, నీరుని కాలుష్యమయం చేశాం. అందుకే వర్షా కాలంలో ఎండాకాలం చూస్తున్నాం. నైరుతి రుతుపవానాలు ప్రవేశించినా పూర్తిస్థాయి వర్షాల జాడలేకుండా పోయింది. భూమ్మీద రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, తుపానులు, పిడుగులు వంటి విపత్తులను పరిశీలిస్తే రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశుల ఉనికి ఎలా ఉంటుందో ఏమో అనే సందేహం కలుగుక మానదు. వీటికి ఎన్నో కారణాలు ఉన్పప్పటికీ ముఖ్యకారణం ప్రకృతి విధ్వంసం.. మానవ తప్పిదాలే అని చెప్పక తప్పదు. మనిషి తన స్వార్థంకోసం పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాడు. పుడమిని కాలుష్యమయం చేసి ప్రకృతి పట్ల తీసుకొన్న అనాలోచిత చర్యలు ఫలితమే ఈ విపత్తులు. విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం కూడా పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. పరిశ్రమలు చేస్తున్న కాలుష్యంతో మానవుడు తనంతట తాను ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నా.. పాలకులు చర్యలకు ఉపక్రమించడం లేదు. వరదలు, విపరీతమైన ఎండలు ప్రకృతి విధ్వంసం వల్ల.. మానవ జనాభా విస్ఫోటనం వల్లనే అని తెలిసీ దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అందుకే వానాకాలం ఎండలకు జనం పిట్టల్లా రాలడం అంటే ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తోంది. జూన్ నెల సగం గడిచినా ఎండా, ఉక్కపోతలు తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు అని తేడా లేకుండా దేశమంతా తీవ్ర మంచినీటి సమస్యలను ఎదుర్కొంటోంది. ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నందున గుండెపోటు మరణాలూ సంభవించాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న కారణంగా దీర్ఘకాల రోగుల మరణాల శాతం పెరుగుతుందంటున్నారు. ఈ క్రమంలో మనమంతా ప్రకృతి విధ్వంసం, పర్యావరణ విధ్వంసం, కాలుష్యం వల్ల కలుగుతున్న అనర్థాలపై పాఠాలు నేర్చుకోవాలి. కనీసం ఇప్పటి నుంచి దిద్దుబాటు చర్యలను కఠినంగా అలవాటు చేస్తే ఓ పదేళ్లకు గానీ సమస్యకు పరిష్కారం దొరకదు. ప్లాస్టిక్, భూమి, నీరు, గాలి కాలుష్యం మన ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా వీటి కాలుష్యాన్ని.. వినియోగాన్నితగ్గించుకోపోలేకపోతున్నాం. వీధులు, మురికి కాలువలు ప్లాస్టిక్ చెత్తతో నిండుతున్నాయి. నదులు, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ ను నింపేస్తున్నాం. భూమిని, సముద్రాలను ఓ డంప్ యార్డుగా చేసేస్తున్నాం. ఇటువంటి ప్లాస్టిక్ భూమిలో కలవడానికి సుమారు వెయ్యి సంవత్సరాలు పడుతుంది. దీని మూలంగా నేల కాలుష్యం జరిగి భూగర్భ జలాలు విషపూరితం అవుతున్నాయి. కాల్చితే పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. పర్యావరణ సమతల్యత దెబ్బతిని దీని వలన తరచూ అడవులు కాలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ సముద్రాలలో కలుస్తుంది. సముద్ర ఉపరితలంలో 40శాతం ప్లాస్టిక్ చెత్తతో కప్పబడి ఉన్నదని, ఇది ఇలా కొనసాగితే 2030 సంవత్సరం నాటికి సముద్రంలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో వున్న జంతువులు, చేపలు శరీరంలోనికి ప్రవేశించి పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి 619 మిలియన్ టన్నులు అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పెన్నుల నుండి ఎలక్ట్రాన్రిక్ పరికరాలు, బొమ్మలు, ఆహార నిల్వకి ఉపయోగించే కవర్లు, ఆట వస్తువులు పి.వి.సి పైపులు, గ్లాసులు మొదలైన వస్తువులు ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి. ప్లాస్టిక్ చౌకగాను, సౌకర్యవంతంగా ఉండడం వలన మన జీవితంలో భాగంగా చేసుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాల వలన మానవునికి, పర్యావరణానికి వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ మన జీవితాలని ఛిన్నాభిన్నం చేస్తున్నదని తెలిసినా ప్రభుత్వాలు వాటిని నిషేధించడం లేదు. ఉత్పత్తులపై ఆంక్షలు విధించడం లేదు. దీనిపై ప్రపంచమంతా మేల్కోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను నిషేధించాలి. ప్లాస్టిక్ ఉత్పత్తలను నిషేధించాలి. పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న చర్యలను నిషేధించాలి. అప్పుడే ఈ భూమ్మీద మనగలుగుతామని గుర్తించాలి. అందుకు ప్రజలుగా మనమంతా వ్యక్తిగతంగా శ్రద్ద పెట్టాలి. ప్లాస్టిక్ పై, కాలుష్యంపై యుద్దం ప్రకటించాలి. ప్లాస్టిక్ వాడకాలను నిషేధించుకోవాలి. ప్రభుత్వాలు కూడా పర్యావరణం కోసం యుద్దప్రాతిపదికన చర్యలకు సిద్దపడాలి. కఠిన చట్టాలను చేయాలి. మొక్కలను పెంచడం, చెట్లు నరకకుండా చూడడం, కొండలు, గుట్టలను పరిరక్షించడం ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించడం వంటి కఠిన చర్యలకు దిగాలి. ఢిల్లీ సమీపంలో పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణం దెబ్బతింటోంది. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతోంది. ఇవన్నీ అడ్డుకోవాల్సిఉంది. ఇందుకు ఓ కమిటీని వేసి అధ్యయనం చేయించాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఫ్రాన్స్ డిక్లరేషన్ తూచ తప్పకుండా అమలయ్యేలా చేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి. నిరంతరం ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. సామాజిక మాధ్యమాలు, టివిలు, పత్రికల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రచారం చేయాలి. అప్పుడే సత్ఫలితాలను సాధించగలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదో సవాల్ గా తీసుకుని పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది.