ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత

ఆదిలాబాద్‌ మాజీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూర్‌లోని తన నివాసంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ‌విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు.

షెడ్యూల్ తెగలకు చెందిన రమేష్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడుగా ఎదుగుతూ వచ్చారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. అతను 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2006-2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జూన్ 2021లో ఈటెల రాజేందర్తోపాటు బీజేపీలో చేరారు.