పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రత గాల్లో దీపమే

  • చట్టాలను పట్టించుకొని పరిశ్రమల యాజమాన్యాలు
  • పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యం
  • అధికారులు, యాజమాన్యాల నిర్లక్ష్యంతో గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు

తెలంగాణ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. అదే సమయంలో పరిశ్రమాల్లోని పని ప్రదేశాల్లో కార్మికులకు భద్రత లేకుండా పోయింది. సరైన రక్షణ చర్యలు లేకపోవడం,డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల నిరంతర పర్యవేక్షణ లేమితో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ కార్మికులు గాయాల బారినపడటం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం సంగారెడ్డిలోని ఓ పార్మా పరిశ్రమ పేలుడు ఘటనలో ఆరుగురు మరణించిన ఘటన మరువక ముందే శుక్రవారం షాద్ నగర్ లో సౌత్ గ్లాస్ సంస్థ ప్రమాద ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడటం పరిస్థితికి నిదర్శనం.

పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా కర్మాగారాలు ప్రమాదకర విభాగంలో ఉన్నాయి. అధికారులు తనిఖీలకు వెళ్లినపుడు ఆయా యాజమాన్యాలు లంచాలు ఇవ్వడమే కాకుండా నాణ్యమైన యంత్రాలను, నిపుణులైన కార్మికులను చూపుతూ నిరభ్యంతర ధ్రువీకరణపత్రం పొందుతున్నాయి. అటు తరువాత యంత్రాల నిర్వహణను గాలికొదిలేయడం, రెగ్యులర్ కార్మికులను తొలగించి.. రోజువారీ కూలీలతో పనులు చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఆ కార్మికుల దగ్గర అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ముందస్తుగా ప్రమాదాల సంకేతాలను వారు గుర్తించలేకపోతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు తగిన రక్షణ పరికరాలు అందించకపోవడం, ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు వేగంగా బయటకు వెళ్లేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో భారీగా ప్రాణనష్టం జరుగుతుంది..

పరిశ్రమల్లో అధికారుల నిరంతర పర్యవేక్షణ లేకనే..
ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా పరిశ్రమలు కార్మిక శాఖకు వివరాలు తెలియజేస్తాయి. కార్మిక శాఖ పరిధిలోని కర్మాగారాల విభాగం అధికారులు ఆ తరహా ఘటనలు భవిష్యత్తులో చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తారు. అయినప్పటికీ పరిశ్రమల యాజమాన్యాలు సదరు నిబంధనలు పాటించడం లేదనే విమర్శలున్నాయి. మరోవైపు పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయా? కార్మికులకు భద్రత ఉందా? లేదా అనేది గుర్తించడంలో కర్మాగారాల విభాగం విఫలమవుతుందనే ఆరోపణలున్నాయి. కర్మాగారాల విభాగంలోని ఖాళీ పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కాలేదు. 20 మంది ఇన్స్పెక్టర్లు, జాయింట్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ప్రస్తుతం తనిఖీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిలో కూడా కొంత మంది అధికారులు లంచాలు తీసుకొని చూసి చూడనట్లు ఉంటుండటంతో.. ఇది కూడా తనిఖీలు సక్రమంగా సాగకపోవడానికి కారణమవగా, పరిశ్రమల నిర్వాహకులకు ఇది వరంగా మారుతోంది.