ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా గోపాల్‌పేట తహసీల్దార్‌

గోపాల్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో చోటుచేసుకున్నది.

మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్‌ వివరాల ప్రకారం.. జింకలబీడు తండాకు చెందిన మూడావత్‌ పాండునాయక్‌ కోళ్లఫారం నిర్మించుకోవడానికి తన భార్య సౌందర్య పేరు మీద ఉన్న 15 గుంట ల వ్యవసాయ భూమిని నాలా(వ్యవసాయేతర భూమి)గా మార్చాలని గత నెల 21న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు.

నాలాగా మార్చేందుకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్‌ డిమాండ్‌ చేయగా.. రూ.8 వేలకు ఒప్పుకున్న పాండునాయక్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం బుధవారం పాండునాయక్‌ తహసీల్దార్‌కు రూ.8 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.