- చట్టాలను పట్టించుకోని పరిశ్రమల యాజమాన్యాలు
- పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు
- ఆమ్యామ్యాల మత్తులో సంబంధిత శాఖల అధికారులు
మన ఇంట్లో పెంచుకునే జంతువులను కూడా మనం ప్రేమగా చూసుకుంటాం.. జాగ్రత్తగా కాపాడుకుంటాం.. కానీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండే కాకుండా బిహార్, రాజస్తాన్, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఒడిశా మొదలగు రాష్ట్రాల నుండి వచ్చి తమ రెక్కల కష్టంతో పరిశ్రమలో పనిచేస్తూ యాజమాన్యం ఆస్తులు, అంతస్తులు పెంచుతున్న కార్మికుల భద్రతను పట్టించుకోకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు పరిశ్రమల యజమానులు. తెలంగాణలోని నల్లగొండ, సంగారెడ్డి, జీడిమెట్ల, పటాన్ చెరు, పాశ మైలారం, రంగారెడ్డి, గడ్డపోతారం, షాద్ నగర్, కొత్తూరు పారిశ్రామిక ప్రాంతంలో తరచూ కనిపించే దృశ్యమిది. తాజాగా సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన సంఘటన మరోసారి పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
కార్మిక చట్టాలు ఇలా..
కార్మికుల కోసం 1936లో వేతనాల చెల్లింపు చట్టం వచ్చింది. తాత్కాలిక కార్మికుల కోసం కనీస వేతనాల చెల్లింపు చట్టాన్ని 1948లో తీసుకొచ్చారు. ఇవి కాకుండా. 1952 నుంచి 70 మధ్య ఈపీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లు, నష్ట పరిహారాల చెల్లింపు, ఒప్పంద కార్మికుల చట్టం వంటివి వచ్చాయి. ఇవన్నీ కార్మికులకు మేలు చేసేందుకు తీసుకొ చ్చినవే. అంతేకాకుండా ప్రతి పరిశ్రమలో 70శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన కూడా ఉంది. దీనిని పరిశ్రమల్లో ఎక్కడా అమలు చేయడం లేదు. నల్లగొండ, సంగారెడ్డి, జీడిమెట్ల, పటాన్ చెరు, పాశ మైలారం, రంగారెడ్డి, గడ్డపోతారం, షాద్ నగర్, కొత్తూరు పారిశ్రామిక ప్రాంతాల పరిధిలో దాదాపు అన్ని పరిశ్రమల్లో కార్మికులతో 12 గంటలు పనిచేయిస్తున్నారు. బిహార్, ఉత్తర్ ప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి వారిని రేకుల షెడ్లలో ఉంచి పనులు చేయిస్తున్నారు. వారికి తాగునీరు, మరుగు దొడ్లు, వైద్యం, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతున్నారు. సౌత్ గ్లాస్ లాంటి పెద్ద ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనే ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోయిన సరే బయటకు పొక్కకుండ పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు కుమ్మక్కై మూడో కంటికి తెలియకుండా మృతదేహాలను వారి రాష్ట్రాలకు పంపుతున్నారు. తరుచూ తనిఖీల ద్వారా ప్రమాదాలను ముందుస్తుగా గుర్తించాల్సిన సంబంధిత శాఖల అధికారులు ఆమ్యామ్యాలతో (లంచాలు) సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు
302 పరిశ్రమలు ఉన్న కొత్తూరు, షాద్ నగర్ పారిశ్రామిక ప్రాంతంలో 32 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఐరన్, స్టీల్ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు కార్మికులను మింగేస్తున్నాయి. తాజాగా సౌత్ గ్లాస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం కూడా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానేనని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన చోట్ల కార్మికులకు తగిన భద్రత కల్పించాలి, కానీ అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం, కాలం చెల్లిన పరికరాలతో నడిపించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గత పదేళ్లలో షాద్ నగర్, కొత్తూరు పారిశ్రామిక ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 68 మంది కార్మికులు మృతిచెందగా అనేకమందికి గాయాలయ్యాయి. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన ప్రమాదాల్లోనివే. వెలుగులోకి రాకుండా జరిగినవి మరెన్నో ఉంటాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్మి కసంఘాల నాయకులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వాల ప్రతినిధులు కార్మికుల హక్కులు, భద్రత గురించి ప్రగల్బాలు పలుకుతున్నారు. కానీ ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్న పరిశ్రమల యజమాన్యలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ పరిశ్రమలను వెంటనే సీజ్ చేయాలి. లంచాలకు అలవాటు పడి తమ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న సంబంధిత శాఖల అధికారులను వెంటనే డిస్మిస్ చేయాలి అప్పుడే వారి ఒంట్లో భయం పెట్టుకొని తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. లేదంటే ఎలాంటి ఘోర సంఘటనలు జరుగుతానే ఉంటాయి. బతుకు దెరువు కోసం వచ్చిన అమాయక కార్మికుల ప్రాణాలు కోల్పోతునే ఉంటారు.