అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్

  • ఏసీబీ దాడులు, విజిలెన్స్ ఎంక్వైరీలతో బేంబేలు
  • ఇప్పటికే పలువురు ఉద్యోగులపై క్రిమినల్ కేసులు
  • పరారీలో పలువురు అవినీతి ఉద్యోగులు
  • బదిలీల కోసం ఎదురుచూస్తున్న మరికొందరు అవినీతి ఆఫీసర్లు

తెలంగాణ వ్యాప్తంగా అవినీతి ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఏసీబీ, విజిలెన్స్ ఆఫీసర్ల దూకుడుతో బెంబేలెత్తుతున్నారు. లంచాలు తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. ఇప్పటికే పలువురు ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు కాగా, వారంతా పరారీలో ఉన్నారు. కొందరు అవినీతి ఉద్యోగులు సాధారణ బదిలీల కోసం ఎదురుచూస్తుండగా, మరికొందరు అవినీతి ఉద్యోగులు బదిలీల్లో భాగంగా ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పైరవీలు చేసుకుంటున్నట్లు సమాచారం.

అవినీతి ఉద్యోగుల్లో బుగులు
తెలంగాణలో గత రెండు, మూడు నెలలుగా వరుసగా అవినీతి ఉద్యోగులపై విజిలెన్స్ ఎసీబీ దాడులు చేస్తూ క్రిమినల్ కేసులు పెడుతుండడంతో అవినీతి ఉద్యోగుల్లో బుగులు మొదలైంది. పలు శాఖల్లో అవకతవకలు బయటపడుతుండడంతో నేరుగా విజిలెన్స్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల పలువురు ఉన్నతాధికారులపైనే కేసులు నమోదు కావడం సదరు ఆఫీసర్ లు కొంతమంది పరారీలో ఉండడం తీవ్ర చర్చకు దారితీసింది. రెవెన్యూ శాఖ, ఎక్సైజ్ శాఖ, ఆర్.టి.ఏ. అలాగే పోలీస్ శాఖలో ఏసీబీ దాడులు పెరగడంతో ఈ మధ్యకాలంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడకుండా ఓ అవినీతి ఎస్ఐ గోడ దూకి పరార్ కాగా ఏసీబీ డీఎస్పీ కేసు నమోదు చేశారు.

సస్పెండ్ కావొద్దనే..
ప్రభుత్వ ఆఫీసర్లు అవినీతి కేసుల్లో సస్పెండ్ కు గురవుతామనే భయంతో పలువురు అవినీతి ఆఫీసర్లు పరార్ అవుతున్నట్లు తెలుస్తోంది. రూల్స్ ప్రకారం కేసు నమోదైన ఆఫీసర్ 48 గంటలు జైలు శిక్ష అనుభవించినట్లయితే సస్పెండ్ కు గురి అవుతాడు. ఈ క్రమంలో అరెస్టయి జైల్ కు వెళ్లకుండా ముందస్తుగా పరార్ అవుతూ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.