వైద్యశాఖ బదిలీల్లో అక్రమాలు!

  • నిగ్గుతేల్చిన ఇంటెలిజెన్స్‌.. ముఖ్యమంత్రికి నివేదిక
  • కోరుకున్న చోట పోస్టింగ్‌కు రూ.లక్షల్లో వసూళ్లు
  • సంఘాల నేతల నుంచి హెచ్‌వోడీల దాకా పాత్ర
  • నర్సుల నుంచి ప్రొఫెసర్ల వరకు అడ్డదారులు
  • అందుకే సీనియార్టీ, వేకెన్సీ జాబితాల్లో మార్పులు

 వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్టు ఇంటెలిజెన్స్‌ విభాగం తన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. అందుకే సీనియార్టీ జాబితాలో పలువురి పేర్లు మాయం అయ్యాయని, మరికొందరివి తప్పుడు వివరాలు నమోదయ్యాయని, వేకెన్సీ జాబితాపైనా ఆరోపణలు వచ్చాయని నిగ్గుతేల్చినట్టు పేర్కొన్నాయి. ఇందులో యూనియన్ల లీడర్లు మొదలుకొని ఓ హెచ్‌వోడీ దాకా ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తేల్చాయని సమాచారం. వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయంలోని ఒకరిద్దరు సిబ్బందికి సైతం ఇందులో పాత్ర ఉన్నట్టు స్పష్టం చేసినట్టు సమాచారం.

దశాబ్దాలుగా ఒక్కచోటే పాతుకుపోయిన నర్సుల నుంచి ప్రొఫెసర్ల దాకా తమ సీట్లను పదిలం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కినట్టు గుర్తించారని తెలిసింది. ఈ క్రమంలో చేతులు మారిన డబ్బు కోట్లలో ఉంటుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తేల్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ఇతర శాఖల్లో సజావుగా బదిలీలు జరుగుతుండగా.. వైద్యశాఖలో మాత్రం బదిలీలపై ఆరోపణలు రావడం, ధర్నాలు, రాస్తారోకోలు జరిగే స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో లోతుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు రంగంలోకి దిగాయని, సమగ్ర నివేదిక రూపొందించాయని సమాచారం. ఈ నివేదికలో ఓ హెచ్‌వో డీ, అదే కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు, మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు, వివిధ అసోసియేషన్ల నాయకులు ఉన్నట్టు సమాచారం.

పేర్లు తప్పించేందుకు లక్షలు..
హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌ వంటి నగరాల్లో పనిచేసేందుకే వైద్యశాఖ సిబ్బంది ఆసక్తి చూపుతుంటారు. అందుకే నర్సులు మొదలు ప్రొఫెసర్ల వరకు దశాబ్దాలుగా అక్కడే పాతుకుపోయారు. చాలామంది ప్రభుత్వ దవాఖానలో పార్ట్‌ టైమ్‌ పని చేస్తూ.. సొంతంగా ప్రైవేట్‌ హాస్పిటళ్లు ఏర్పాటు చేసుకొని, లేదా కన్సల్టేషన్ల ద్వారా భారీగా సంపాదించడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు జిల్లాలకు బదిలీ అయితే ఈ దందా చేజారుతుందన్న ఉద్దేశంతో తమ పోస్టును కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రూ.లక్షలు పోసైనా సరే బదిలీని అడ్డుకునేందుకు సిద్ధం అయ్యారని చెప్తున్నారు. ఇదే అదునుగా బదిలీల్లో కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇప్పిస్తామంటూ కొందరు అక్రమార్కులు మధ్యవర్తుల అవతారం ఎత్తారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

పోస్టింగ్‌ కొనసాగిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.లక్షలు వసూలు చేసినట్టు తమ విచారణలో తేలిందని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అందుకే కొందరికి అర్హత లేకున్నా ఆఫీస్‌ బేరర్లుగా సర్టిఫికెట్లు వచ్చాయని, బదిలీల కౌన్సెలింగ్‌లో సీనియార్టీ జాబితా నుంచి పేర్లు మాయం అయ్యాయని, మరికొందరు తప్పుడు వివరాలు అప్‌లోడ్‌ చేశారని ఇంటెలిజెన్స్‌ నివేదికలో ప్రస్తావించించినట్టు సమాచారం. ఈ దందాలో మంత్రి ఆఫీసు అధికారుల హస్తం కూడా ఉందని తేల్చినట్టు సమాచారం. మంత్రి పేరు చెప్పి పలు జిల్లాల డీఎంహెచ్‌వోల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. అడిగినంత ఇస్తేనే ఆ పదవిలో కొనసాగుతారని.. లేదం టే వేటు తప్పదని బెదిరించినట్టు తెలిసింది. ఓ ప్రైవేట్‌ వ్యక్తి ద్వారా ఈ డబ్బులను సేకరించినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయట.

తప్పు మీదంటే మీదే..
వైద్యశాఖలో ప్రధానంగా డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో బదిలీలు గందరగోళంగా మారాయి. డీఎంఈ, టీవీవీపీ తదితర విభాగాల్లోనూ ఆరోపణలు వినిపించినా.. పెద్దగా బయటికి రాకుండా ‘మేనేజ్‌’ చేశారని చెప్పుకుంటున్నారు. కానీ డీపీహెచ్‌ పరిధిలో వేలాది మంది ఉద్యోగులు ఉండటం, నిబంధనలకు విరుద్ధంగా వందల మందికి మినహాయింపులు దక్కడంతో రచ్చ జరిగిందని చెప్తున్నారు. సీనియార్టీ జాబితాను మూడుసార్లు మార్చినా లోపాలు బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఏకంగా కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ముందు నర్సులు అర్థరాత్రి దాకా ధర్నా చేశారు. దీంతో ముఖ్యమంత్రి ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌వోడీలు తమ తప్పులేదని చెప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేసినట్టు సమాచారం. డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న నర్సులు సరిగా వివరాలు ఇవ్వకపోవడం వల్లే నర్సుల సీనియార్టీ, వేకెన్సీ పోస్టుల జాబితాల్లో తప్పులు దొర్లాయని డీపీహెచ్‌ ఆరోపించారు.

ఈ మేరకు ఇటీవలే డీఎంఈకి ఓ లేఖ రాశారు. 23 దవాఖానల నుంచి తమకు వచ్చిన వివరాలు తప్పుల తడకగా ఉన్నాయంటూ అందులో పేర్కొన్నట్టు సమాచారం. మొత్తం నర్సింగ్‌ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చి, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. దీంతో.. డీపీహెచ్‌, ఆయన కింది అధికారులు తప్పు చేసి మాపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ డీఎంఈ విభాగం మండిపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపైనా ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారంతో అటు ప్రభుత్వం పరువు పోవడంతోపాటు, ఇటు అసెంబ్లీ సమావేశాల వేళ ప్రతిపక్షాలకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అయ్యిందని ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. (సోర్స్: నమస్తే తెలంగాణ)