- పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం
- ఇండస్ కేమ్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో జనం ఉక్కిరిబిక్కిరి
- దుర్వాసనతో పలు గ్రామాల ప్రజలు సతమతం
- ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
కాలుష్య కారక పరిశ్రమలతో పంట పొలాలు నాశనం అవుతున్నాయి. భూగర్భ జలాలు కలుషితమై తీవ్ర పంటనష్టం జరుగుతున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ గ్రామ సమీపంలో ఉన్న ఇండస్ కేమ్ కర్మాగారం నుంచి వెలువడుతున్న కెమికల్ వ్యర్థాలు భూమిలో కలుస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు కలుషితమై సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యర్థాల కారణంగా పెద్దవాగు జలాలు కలుషితం అవుతున్నాయి. సమీప ప్రాంతాల్లోని కాలనీలు, గ్రామాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు వాసన భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో వాయు కాలుష్యానికి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం లేదు.
ఇండస్ కేమ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్ధాలు పలు గ్రామాలకు శాపంగా మారాయి. పరిశ్రమ వ్యర్థాలతో నీరు, గాలి కలుషితమవుతున్నది. దుర్వాసనతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరన్ కోట్ గ్రామ సమీపంలో ఉన్న ఇండస్ కేమ్ కర్మాగారంతో దుర్వాసన, భూగర్భ జలాలు కలుషితమవుతున్న విషయం తెలిసిందే. 2012లో ఏర్పాటైన ఈ పరిశ్రమ నుంచి వచ్చే రసాయన వ్యర్థాలను సమీపంలో ఉండే నీటిలోకి యథేచ్ఛగా వదిలేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆ నీరు సమీపంలోని పొలాల్లోకి చేరుతున్నది. సమీపంలోని పంట పొలాలు కూడా నాశనమయ్యాయి. దీంతో పంటలు సరిగా పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న దుర్వాసనతో గుంతబాష్పల్లి, మిట్టబాష్పల్లి, మల్కాపూర్, కోట్ బాష్పల్లి, జింగుర్తి, ఐనేల్లి గ్రామాల ప్రజలతో పాటు రహదారి మీదుగా ప్రయాణిస్తున్న వారు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి జల, వాయు కాలుష్యానికి కారణమైన పరిశ్రమపై చర్యలు తీసుకొవాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
విచ్చలవిడిగా కాలుష్యం…
పరిశ్రమ యాజమాన్యం కాలుష్యాన్ని విచ్చలవిడిగా బహిరంగ ప్రాంతాలకు వదులుతున్నారు. జల కాలుష్యంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. రాత్రి సమయాల్లో వాయు కాలుష్యానికి ఊపిరి, శ్వాసకు ఇబ్బంది కలుగుతుందని వాపోతున్నారు. వ్యర్ధాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. దీంతో ఇళ్లలోని బోర్ల నుంచి కలుషిత నీరు వస్తుండడంతో ప్రజలు నీటిని కొనుగోలు చేస్తున్నారు. కాలుష్యంతో అటు ప్రజలు, ఇటు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జలకాలుష్యంతో పంట దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
పంట దిగుబడి తగ్గింది..
పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. వ్యవసాయ బోర్ల నుంచి కలుషిత నీరు వస్తున్నది. దీంతో పంట దిగుబడి 25శాతా నికి పడిపోయింది. కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదు రవుతున్నాయి. నీటిని వాడితే పలు వ్యాధులు వస్తున్నాయి. – నరసింహ, రైతు, గుంతబాష్పల్లి
చచ్చి బతుకుతున్నాం..
కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని భరించలేకున్నాం. కాలుష్యానికి కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. కలుషిత నీటితో పలు వ్యాధులకు గురవుతున్నాం. అధికారులు స్పందించి తమ గ్రామాన్ని కాలుష్య కోరల్లో నుంచి కాపాడాలి. -మాన్యమ్మ, గుంతబాష్పల్లి
అధికారులు నిర్లక్ష్యం వీడాలి…
కాలుష్యం ప్రజలను పట్టి పీడిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం బాధాకరం. వాయు, జల కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్లక్ష్యం వీడాలి. -జగదీశ్, గుంతబాష్పల్లి, మాజీ సర్పంచ్
రోగాల బారిన ప్రజలు..!
కంపెనీ ద్వారా విడుదలవుతున్న వ్యర్థాల కారణంగా పెద్దవాగులో జలాలు కలుషితం అవుతుండడంతో పాటు ఈ వ్యర్థాలు ప్రవహించే పరీవాహక ప్రాంతంలోని కాలనీలు, గ్రామాల్లో తీవ్ర దుర్గందం వ్యాపిస్తున్నది. దీంతో ప్రజలు వాసన భరించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్యా క్టరీ యాజమాన్యానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ నీరు ప్రవహించిన పంట భూములన్నీ తెల్లబారి పోయి భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే పరిస్థితి ఉందని నిపుణులంటున్నారు. ఈ నీటి వినియోగంతో సాగు చేస్తే దిగుబడులు కూడా బాగా తగ్గుతున్నట్టు చెబుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ఈ వ్యర్థ జలాలలో కలిసి అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటిలో కలుస్తున్నాయి. కొంత కాలంగా ప్యాక్టరీ నుంచి విడుదలయ్యే జలాలతో నీరు కూడా దుర్వాసన వస్తోందని రైతులు చెబుతున్నారు. రసాయానాల వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, గుండె, ఊపిరితిత్తులు, కంటి సంబంధిత వ్యాధులు, శ్వాసనాళ సంబంధిత వ్యాధులు, దగ్గు, దమ్ము వంటి అనారోగ్యకరమైన దుష్ప్రభవాలు తలెత్తుతుతాయని స్థానికులు చెబుతున్నారు. (సోర్స్: దిశ న్యూస్)