
తుర్కపల్లి పారిశ్రామికవాడలో భారత్ బయోటెక్ కంపెనీలో భవన నిర్మాణ పనుల్లో భాగంగా రెండో అంతస్తుకు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలి… 21 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… శామీర్‌పేట మండలం, తుర్కపల్లి పారిశ్రామికవాడలోని భారత్ బయోటెక్ కంపెనీలో నూతనంగా నిర్మాణం పనులు చేపట్టారు. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రెండో అంతస్తుకు స్లాబ్ వేస్తున్నారు. ఈ పనుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 54 మంది కూలీలు ఉన్నారు. సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారికి స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన21 మందిని 108లు, కంపెనీ అంబులెన్స్‌లో లక్ష్మక్కపల్లిలోని ఆర్‌వీఎం దవాఖానకు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉండగా నగరంలోని యశోద దవాఖానకు తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న తుర్కపల్లి గ్రామస్తులు భారీగా కంపెనీ వద్దకు చేరుకున్నారు. ప్రమాద ఘటనపై తెలుసుకున్నారు. అయితే కంపెనీ యాజమాన్యం గేటుకు తాళాలు వేసుకొని పోలీసులను తప్పా.. మిగతా ఎవరినీ కూడా లోపలికి అనుమతించలేదు. దీంతో కంపెనీ ముందు గ్రామస్తులు, ఉద్యోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.