పీసీబీ ఉన్నట్లా.. లేనట్లా..?

  • కాలుష్య నియంత్రణలో పీసీబీ అధికారులు విఫలం
  • నా మాట వినట్లేదు.. మీ మాటైనా వింటారా..!
  • సీఎస్ శాంతికుమారికి మంత్రి కొండా సురేఖ 70 పేజీల ఫిర్యాదు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తీరు మారకపోతే పీసీబీని రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించిన నెల రోజుల్లోపే మరో అంశం తెరపైకి వచ్చింది. అటవీ, పర్యావరణశాఖల మంత్రి కొండా సురేఖ.. పీసీబీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పిర్యాదు చేశారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణం, ప్రజారోగ్య పరిరక్షణలో అదికారులు విఫలమవుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. పీసీబీ చైర్ పర్సన్ గా కూడా వ్యవహరిస్తున్న సీఎస్ శాంతికుమారికి నాలుగు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ దాదాపు 70 పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని పీసీబీకి పదేపదే ఆదేశాలిచ్చినా.. అధికారులు నా మాట వినట్లేదు. మీ మాట అయినా వింటారా? జోక్యం చేసుకుని చర్యలు తీసుకోండి’ అని మంత్రి కోరారు. ‘పర్యావరణం, ప్రజారోగ్యం పరిరక్షణకు జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. పరిశ్రమల తనిఖీకి, వాటిపై వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీలు ఉండాలి. వీటిలో రెవెన్యూ, గనులు, పోలీస్, ఇరిగేషన్, పురపాలకశాఖల అధికారులుండాలి’ అని మంత్రి తన లేఖలో ప్రతిపాదించారు.

పీసీబీ వి తూతూ మంత్రం విచారణలేనా..?

పీసీబీ వైఫల్యాల్ని మంత్రి ప్రస్తావిస్తూ.. పలు అంశాల్ని తన ఫిర్యాదుకు జతచేశారు. సంగారెడ్డి దగ్గర ఓ డిస్టిలరీ కారణంగా చెరువు నీరు కలుషితమై 50 గొర్రెలు చనిపోతే పీసీబీ అధికారులు విచారణ తూతూ మంత్రంగా ముగించారు. చిట్కుల్ చెరువుల్లో చేపలు చనిపోతే.. ఆ నీరు కలుషితం కాలేదని నివేదిక ఇచ్చారు. వరంగల్ లో క్వారీలపై 20 ఫిర్యాదులొచ్చినా.. ఒక్క క్వారీపైనా చర్యల్లేవు తెల్లాపూర్ దూళి కాలుష్యానికి కారకులపైనా చర్యల్లేవు. పీసీబీ ప్రధాన కార్యాలయంలో 17 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారినీ బదిలీ చేయలేదు. పీసీబీ ఉన్నట్లా.. లేనట్లా..? శాఖ మంత్రిగా తనిఖీలపై నేను అడిగినా ఏ సమాచారమూ ఇవ్వట్లేదు. కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవట్లేదు. పీసీబీ తనిఖీలు, ఇచ్చిన అనుమతులు, విదించిన జరిమానాలపై నెలవారీ నివేదికలు అడిగినా ఇవ్వట్లేదు. పీసీబీ అధికారుల తీరు కారణంగా అసెంబ్లీలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నా. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాదానం ఇవ్వలేకపోయా’ అంటూ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పు రాకపోతే అసెంబ్లీలో సభాహక్కుల తీర్మానం ప్రవేశ పెడతానని, గవర్నర్ దృష్టికీ తీసుకెళతానని సీఎస్ కు మంత్రి మౌఖికంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. (సోర్స్: ఈనాడు)