రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు(ఆహార భద్రత కార్డులు) మంజూరుపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డులు లేనివారికి అవకాశం కలుగుతుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫార్సులకు లోబడి కొత్త ఆహార భద్రత(రేషన్) కార్డుల జారీకి సంబంధించి అర్హత ప్రమాణాలు, విధానాలు పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కమిషనర్‌కు పరిశీలన కోసం పంపిస్తారు.
మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల పరిధిలో కమిషనర్లు ఈ ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారు. ముసాయిదాజాబితాను గ్రామసభ వార్డులో ప్రదర్శించి చర్చిస్తారు. గ్రామసభ ఆమోదం తదుపరి లబ్ధిదారుల లాగిన్‌లో నమోదుచేసి జిల్లా కలెక్టర్, హైదరాబాద్‌లో అయితే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు పంపిస్తారు. వారి పరిశీలన తదుపరి ఫైనల్ జాబితాను రూపొందిస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క అహార భద్రత(రేషన్)కార్డు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆహారభద్రత కార్డుల్లో కుటుంబసభ్యులు చేర్పులు, తొలగింపులు చేసే అవకాశం ఉంటుంది.