- నామమాత్రపు తనిఖీలతో పీసీబీ అధికారుల నిర్లక్ష్యం
- పరిశ్రమలకు సహకరిస్తున్న పీసీబీ అధికారులు..!
- ప్రభుత్వానికి యాదాద్రి భువనగిరి జిల్లా రైతుల ఫిర్యాదు
మూసీలో రసాయన వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలపై, రసాయన పరిశ్రమలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రైతు నాయకుడు గుమ్మి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధిత రైతులు ముఖ్యమంత్రి కార్యాలయం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు చేశారు. చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెంలోని జయ ల్యాబొరేటరీ పరిశ్రమ వద్ద గత డిసెంబర్ 10న, 23న అధికారులు తనిఖీలు నిర్వహించారని, ఆ తర్వాత నిలిపివేశారని పేర్కొన్నారు. మధ్యలో 12 రోజులు సమయం ఇవ్వడంతో పరిశ్రమ యాజమాన్యం రసాయనిక వ్యర్థాలను మూసీలోకి వదిలిందని తెలిపారు. పరిశ్రమలోని గేట్ రిజిస్టర్, సీసీ టీవీ దృశ్యాలను తనిఖీ చేయాలని కోరినా పీసీబీ అధికారులు పరిశ్రమ యజమానులతో కుమ్మక్కయ్యి పట్టించుకోలేదని ఆరోపించారు. అంతమ్మగూడెం సమీపంలోని హెజేలో, బృందావన్, కెమిక్, శ్రీజయ పరిశ్రమలు మూసీ కాలుష్యానికి కారణమవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బోరుబావుల్లో విషం… పీసీబీ అధికారుల నిర్లక్ష్యం
బోరు బావుల్లోని నీటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీ 43వేలు, టీడీఎస్ 27వేలకు పైగా పెరిగినప్పటికీ అధికారులు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడంలేదని రైతులు వెల్లడించారు. 6 నెలల్లోనే 2 పరిశ్రమల నుంచి 100కు పైగా ట్యాంకర్ల ద్వారా రసాయనాలను మూసీలో వదిలేసినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని తెలిపారు. పీసీబీ అధికారులు పరిశ్రమల నుంచి ఏటా 60 వేలకు పైగా నమూనాలు సేకరించాల్సినప్పటికీ 10శాతం కూడా సేకరించడంలేదని వివరించారు. ఒక పరిశ్రమ తనిఖీకి కనీసం 4 నుంచి 8 గంటల సమయం పడుతుందని, కానీ ఒకే అధికారి ఒకే రోజులో నాలుగైదు పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి, ఇష్టమొచ్చినట్టుగా నివేదికలు రాస్తున్నారని చెప్పారు. పీసీబీ అధికారులు తనిఖీలు సక్రమంగా నిర్వహించి, పారదర్శకంగా నివేదికలు రూపొందించాలని డిమాండ్ చేశారు. గ్రామ సమీపంలో కాలుష్యాన్ని గుర్తించేందుకు మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఫిర్యాదులో కోరారు.