నా భార్య ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : సినీ జర్నలిస్టు ప్రభు

తన భార్య ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో బాధ్యుల పేర్లు స్పష్టంగా చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని సినీ జర్నలిస్టు ప్రభు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కుమార్తెతో కలిసి వివరాలు వెల్లడించారు. ఈనెల 2వ తేదీన తన భార్య దుర్గామాధవి కన్పించకుండా పోయిందని, అదేరోజు సాయంత్రం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. 3వ తేదీన తన భార్య మృతదేహాన్ని మాదాపూర్‌ పోలీసులు గుర్తించి ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారన్నారు. ఆ విషయం వెంటనే తమ దృష్టికి తీసుకురాలేదన్నారు.

4న పంజాగుట్ట పోలీసులను అడిగితే మృతదేహం లభించినట్లు తెలిపారన్నారు. ఫలితంగా తన భార్య మృతదేహం మార్చురీలో మూడు రోజులపాటు అనాథ శవంగా ఉందన్నారు. పంజాగుట్ట, మాదాపూర్‌ పోలీసుల మధ్య సమన్వయం లోపం వల్లే తమకు ఆలస్యంగా సమాచారం తెలిసిందన్నారు. మృతురాలు సుసైడ్‌ నోట్‌(సెల్ఫీ వీడియో)లో స్పష్టంగా తన ఆత్మహత్యకు రక్త సంబంధీకులే కారణమని చెప్పినా.. ఇంత వరకు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, ఘటన జరిగి సుమారు 15రోజులు గడుస్తున్నా ఇంకా లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంటున్నామని పోలీసులు చెప్పడం బాధాకరమన్నారు.

తన భార్య ఈనెల 2వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. ఆటో ఎక్కిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో ఉన్నాయని, కానీ దుర్గంచెరువు వద్ద సీసీ ఫుటేజీల కోసం పోలీసులకు విజ్ఞప్తి చేయగా, చెరువు చుట్టూ ఉన్న 60 సీసీ కెమెరాల్లో 30 వరకు పనిచేయడం లేదని చెప్పారన్నారు. ఫలితంగా తన భార్య ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా తోసివేశారా? ఇంకేమైనా జరిగిందా? అనేది మిస్టరీగా ఉండిపోయిందన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తన భార్య సుసైడ్‌ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులపై విచారణ జరిపి కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు.