ఈ నెల 28న న‌ల్ల‌గొండ‌లో బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు హైకోర్టు అనుమ‌తి

 న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 28న న‌ల్ల‌గొండ క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్‌లో రైతు ధ‌ర్నా నిర్వ‌హించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీకి కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు రైతు ధ‌ర్నా నిర్వ‌హించేందుకు కోర్టు అనుమ‌తిచ్చింది. ఈ బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి, ప‌లువురు నాయ‌కులు హాజ‌రు కానున్నారు.

కాంగ్రెస్‌ సర్కార్‌ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న‌ నల్లగొండలో బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ప్ప‌టికీ, జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ జిల్లా పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రైతు ధ‌ర్నా అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీకరించిన కోర్టు.. బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు అనుమ‌తిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.