తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు:సిఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. నేను ఎవర్నీ సిఫార్సు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తనకు రాహుల్‌ంధీకి మధ్య గ్యాప్ లేదని, మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు. రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌తో తన అనుబంధంపై తెలియనివాళ్లు మాట్లాడితే తనకేంటి? అని, ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయని ఆయన అన్నారు. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటానని, వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవని ఆయన తెలిపారు.

పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమని, పని చేసుకుంటూ పోవడమే తనకు తెలుసనీ ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు. త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలన్న ఆలోచన తమకు లేదన్నారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. కులగణన ఆషామాషీగా చేసింది కాదని, ఎంతో పకడ్భందీగా చేశామని సిఎం రేవంత్ తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని కులగణన సర్వే చేశామని ఆయన అన్నారు. కులగణనతో ముస్లిం రిజర్వేషన్‌లకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయ్యిందన్నారు. కులగణనతో బిసిలు ఐదున్నర శాతం పెరిగారని, బిసిలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో అంగీకరించారని సిఎం వివరించారు. పిసిసి కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఈ విషయంలో ఈ రోజు లేదా రేపు ప్రకటన ఉంటుందన్నారు.