సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశార‌నే ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసులో పోలీసులు ఆయన‌ను బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఓబులవారిపల్లె తరలించి గురువారం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వాదలు.. శుక్రవారం ఉదయం 5 గంటల వరకు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్‌ ఇవ్వాలని కోర్టును కోరారు. దానికి నిరాకరించిన కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో మార్చి 12 వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళిని రాజంపేట జైలుకు తరలించారు.

జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గం మై హోమ్ భూజ అపార్ట్మెంట్‌లోని ఆయన నివాసానికి వెళ్ళిన ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోసానిపై మొత్తం 11 కేసులు ఉన్నట్లు స‌మాచారం. ఇందులో బీఎన్ఎస్ 196,353 (2),111 రెడ్ విత్ 3 (3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అంతకుముందు బుధ‌వారం రాత్రి పోసాని అరెస్ట్ చేసే క్రమంలో అత‌డు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. మీరెవ‌రో నాకు తెలియ‌దు. నేనేందుకు రావాలంటూ పోలీసులను ప్రశ్నించాడు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని.. నోటీసులు పంపితే ఆరోగ్యం కుదుట‌ప‌డ్డాక పోలీసుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని పోసాని తెలిపాడు. సినీ పరిశ్రమలో వ‌ర్గ విభేదాలు సృష్టించేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై జ‌న‌సేన నేత జోగినేని మ‌ణి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నేడు పోసానిని హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

పోసానిపై మరో కేసు..
సినీనటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ పోలీసులు మరోకేసు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్‌లో పగడాల వెంకటేశ్‌ ఈ నెల 20న పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. కాగా, ఏపీ మాజీ సీఎం, జగన్‌ పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో పరామర్శించి. న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.