పరిశ్రమల కాలుష్యాన్ని నివారించాలని బాచుపల్లిలో భారీ ర్యాలీ..

  • కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోండి
  • పిసిబి నిర్లక్ష్యంతో మా ప్రాణాలకు ముప్పు

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు పరిశ్రమల కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. గత కొంతకాలంగా బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ ప్రజలు వాయు కాలుష్యాన్ని నివారించాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో ఆదివారం బాచుపల్లిలో పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ కాలుష్యానికి, పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఫ్లకార్డులు చేతబూని నినదిస్తూ కావ్య ఏవెన్యూ కమ్యూనిటీ హాల్ నుండి మల్లంపేట రోడ్‌లోని సిల్వర్ ఓక్స్ పాఠశాల మీదుగా బాచుపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ కాలుష్యం కారణంగా బాచుపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చడం కష్టతరంగా మారుతుంద‌న్నారు. విషవాయువుల విడుదలతో రాత్రిపూట బయటకు వస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని పేర్కొన్నారు. బాచుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఐడీఏ బొల్లారం, కాజిపల్లి, బొంతపల్లి, జిన్నారం తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు విచ్చలవిడిగా రాత్రి పొద్దుపోయిన తర్వాత, తెల్లవారి జామున హానీకారకమైన విషవాయువులను గాలిలోకి విడుదల చేస్తుండడంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిశ్రమలను మూసివేసేదాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పీసీబీ డౌన్.. డౌన్.. పీసీబీ జాగో పొల్యూషన్ బాగో, పీసీబీ అధికారులు మొద్దు నిద్ర వీడాలి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, వి వాంట్ జస్టిస్, స్వచ్ఛమైన గాలి మా జన్మ హక్కు, పీసీబీ నిర్లక్ష్య వైఖరి నశించాలి, కాలుష్యం వెదజ‌ల్లుతున్న ఫ్యాక్టరీలను మూసివేయాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో బాచుపల్లి, నిజాంపేట్ ప్రగతి నగర్ కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.