టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను, అలియాస్ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు. గతంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవడంతో కంచన్‌బాగ్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన కొన్నాళ్లు కోమాలోకి వెళ్లారు. కాగా ఆదివారం చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. టీఎన్జీవో యూనియన్‌లో చాలామంది అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మారినా ఆయన మాత్రం కోశాధికారిగా సేవలందిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ముఖంపై బొట్టుతో కనిపించే ఆయనను తోటి ఉద్యోగులు బొట్టు శీనన్న అని ప్రేమగా పిలుచుకునేవారు. రామినేని శ్రీనివాస్‌రావు అకాలమరణం పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, మాజీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంతాపం తెలిపినవారిలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ, సహ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, సహ అధ్యక్షుడు బీ శ్యామ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కురాడి శ్రీనివాస్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, కొండూరు గంగాధర్, మామిడి ప్రభాకర్, క్రాంతికిరణ్, చక్రధర్, ఈ కిరణ్‌రెడ్డి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాదరావు, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు కారం రవీందర్‌రెడ్డి, కే శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.