ప్రకృతితో పరాచకాలొద్దు..!

మానవ తప్పిదాల వల్ల విపత్తులు ఒకదానివెంట ఒకటి తోసుకువస్తున్నాయి. ఆపార ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. వాతావరణంలో తలెత్తుతున్న అనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈప్రకృతి వైపరీత్యాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆధునిక విజ్ఞానం ఎంతో ఆర్జించామని విర్రవీగే అమెరికా లాంటి దేశాలు కూడా ఈ వైపరీత్యాల నుంచి బయటపడలేకపోతున్నాయి. ముఖ్యంగా కారుచిచ్చులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నగరాలకు నాగరాలకే చిచ్చుపెడుతున్నాయి. ఇందుకు ముందుగా నిందించాల్సింది, తప్పుపట్టాల్సింది మానవుడినే. మానవుడి పర్యావరణ విధ్వంస చర్యలే ఈ బీభత్సానికి, విపత్తులకు కారణమవుతున్నాయని ఎన్నో అధ్యయనాలే స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడడం అటుంచి తూట్లుపొడవడం అత్యంత దురదృష్టకరం. చివరకు అభివృద్ధిపేరుతో ప్రభుత్వాలు చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు వర్యావరణానికి చేటు తెస్తున్నాయి. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల నుంచి మొదలు పెడితే కొండలనుతొలచి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం, నగరీ కరణ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఎకరాల పంట పొలాలను జనావాసాలుగా మార్చడం ఒకటేమిటి ఎన్ని విధాలుగా పర్యావరణానికి నష్టం చేయగలుగుతారో అన్ని మార్గాల్లో నిత్యం అన్వేషణ, విధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం మరో యేడెనిమిదేళ్లలో భారత్ జనాభా నూట నలభై ఐదు కోట్లకు చేరుకుంటుందని అందుకు తగినట్టుగా దేశంలోని సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుందని ముఖ్యంగా అటవీ సంపద హరించుకుపోతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే భారత్ లో దాదాపు ప్రతిరోజూ మూడు వందల ముప్పై ఎకరాలకు పైగా అటవీ భూమి అదృశ్యమైపోతుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడిస్తున్నది. బొగ్గుగనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలు, నదీలోయ ప్రాజెక్టులకోసం అడవులను నరికివేస్తున్నారు. ఇలాంటి కారణాలు ఎన్నో పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. మానవుడికే కాదు పశుపక్ష్యాదుల అన్నింటికి హానిచేసే ప్లాస్టిక్ వాడకం అంతకంతకు పెరిగిపోతున్నది. కొన్ని ప్లాస్టిక్ వస్తువులు నిషేధించినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. యధేచ్చగా వాడుతున్నారు. ప్లాస్టిక్ సంచి మట్టిలో కలిసి పోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి ఎంతటి నష్టం చేకూరుస్తుందో ప్రజల్లో అవగాహన కల్పించడంలో అధికారవర్గాలు విఫలమవుతున్నాయనే చెప్పొచ్చు.

ఇక పెట్రో, డీజిల్ వంటి ఇంధనాల వాడకం గురించి చెప్పక్కర్లేదు. వాహన కాలుష్యం నియంత్రణ మాటలకే పరిమితమవుతుంది. ఇక పరిశ్రమలు వదులుతున్న పొగ ధూళికణాలు తదితరవన్నీ కలిసి వాయుకాలుష్యాన్ని తారాస్థాయికి తీసుకుపోతున్నాయి. ముఖ్యంగా వాయుకాలుష్యంతో దేశంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని నియంత్రించేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సఫలీకృతం కావడంలేదు. ఇలాంటి రకరకాల కారణాలతో భూమి ఉష్ణోగ్రత పెరిగిపోక తప్పదు. ఈసారి వేసవిలో అత్యధికంగా ఉష్ణోగ్రత ఉంటుందని, నలభైయేడు డిగ్రీల వరకు వెళ్లినా ఆశ్చర్యంలేదని శాస్త్రవేత్తలే అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉష్ణోగ్రత పెరిగి ప్రపంచంలోని తీరప్రాంతాలు, దీవులతో సహా అనేక దేశాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గతంలోనే పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇక ఇలా ప్రకృతి మనిషితో ఆటలాడుకుంటుంటే అందుకు ప్రతికగా ప్రకృతి తీవ్రంగా స్పందిస్తున్నది. పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్న కారణంగా సకాలంలో వర్షాలు కురవకపోవడం, కురిస్తే ఒకే ప్రాంతంలోకుంభవృష్టి కురవడం ఇటీవలకాలంలో పెరిగిపోతున్నది. వరదలు, తుఫాన్ లు. భూకంపాలు లాంటి ఉపద్రవాలు చోటు చేసుకుంటున్నాయి. యేటా ప్రపంచవ్యాప్తంగా మూడువందల ఎనభైకి పైగా ఉపద్రవాలు సంభవిస్తున్నట్లు అధికార రికార్డులే వెల్లడిస్తున్నాయి. ఈ ఉపద్రవాల కారణంగా యేటా లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే కోట్ల సంఖ్యలో రోగపీడితులు అవుతున్నారు. పాకిస్థాన్, ఇరాన్, హైతి, న్యూజిలాండ్, నేపాల్ లాంటి ఎన్నోదేశాలలో గతయేడాది అంతకుముందు వచ్చిన భూకంపాలు ప్రళయమే సృష్టించాయని చెప్పొచ్చు. మొన్న ఆ మధ్య సిరియాలో వచ్చిన భూకంపం కారణంగా యాభై తొమ్మిది వేల మంది అసువులు బాశారు. ఆ తర్వాత మొరోకాలో వచ్చిన ప్రకంపనాలతో దాదాపు నాలుగువేల మంది జీవితాలు సమాధి అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ భూ ప్రకంపనాలు సృష్టించిన విలయాల నుండి బాధితులు కోలుకోలేకపోతున్నారు. భారత్ కు సంబంధించి కూడా అనేకప్రాంతాలో భూప్రకం పనాలు తరుచుగా వస్తూనే ఉన్నాయి. చెన్నై, పూణె, ముంబాయి, కోల్ కతా, ఢిల్లీ లాంటి దాదాపు డెబ్బై నగరాల్లో భూకంపాలు పొంచి ఉన్నట్లు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. పాలకులు తీసుకుంటున్న ముందు జాగ్రత్తల వల్ల ఉపద్రవాలకు సంబంధించి ప్రాణ, ఆస్తుల నష్టం కొంతవరకు నియంత్రించగలుగుతున్నారు. కానీ పర్యావరణం సమతుల్యం దెబ్బతిన్నకారణంగా ఏర్పడుతున్న ప్రకృతి విజృంభణకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. ఏదిఏమైనా ఉపద్రవాల నియంత్రణకు పర్యావరణాన్నికాపాడేందుకు త్రికరణ శుద్ధిగా కృషిజరగాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరెన్నో ప్రళయాలు వస్తాయి.