హెచ్‌సీయూ విధ్వంసం ఆపండి.. ప్ర‌భుత్వాన్ని వేడుకున్న న‌టి రేణూ దేశాయ్

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని 400 ఎకరాల భూముల్లో పర్యావరణ విధ్వంసానికి తెగబడుతున్న రేవంత్‌ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయ‌కులు కూడా దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం అగ్గి రాజేస్తున్న నేపథ్యంలో.. పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ వివాదంపై సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన న‌టి రేణూ దేశాయ్ తాజాగా ఒక వీడియోను విడుద‌ల చేసింది. ఈ విధ్వంసాన్ని ఆపాలంటూ రేవంత్ రెడ్డిని వేడుకుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూ వివాదం గురించి నాకు రెండు రోజుల ముందు తెలిసింది. ఈ విష‌యంపై అన్ని తెలిసిన త‌ర్వాత మాట్లాడుదామ‌ని స‌మ‌యం తీసుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 44 ఏండ్లు.. రేపో మాపో చ‌నిపోతాను. కానీ నా పిల్ల‌లు.. మ‌నంద‌రి పిల్ల‌లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వారికి ఆక్సిజ‌న్ కావాలి.. వాట‌ర్ కావాలి. వారి భ‌విష్య‌త్ కోసం ఆలోచించండి. అభివృద్ధి అనేది జ‌ర‌గాలి కానీ ఈ 400 ఎక‌రాల విధ్వంసం ఆపేందుకు ప్ర‌య‌త్నించండంటూ రేణూ దేశాయ్ చెప్పుకోచ్చింది.