పర్యావరణం విషయంలో మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్‌

 పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘14వేల ఎకరాలు హైదరాబాద్‌ ఫార్మాసిటీ కోసం సేకరించాం. మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది. ఒప్పించి.. మెప్పించి.. కోర్టుకు కూడా సరైన వివరాలు సమర్పించి.. కేంద్ర అటవీశాఖ అనుమతులు తీసుకొని గ్రీన్‌ ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాం. ఇవాళ దాంట్లో నువ్వు ఫోర్త్‌ సిటీయో.. 420 సిటీయో కడుతున్నవ్‌ అక్కడ. నేను అడుగుతున్న.. 14వేలు నీ చేతుల్లో ఉన్నప్పుడు.. వడ్డించిన విస్తరిలా నీ చేతుల్లో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాలపై ఎందుకుపడ్డవ్‌. నువ్వు కట్టే ఐటీ పార్క్‌లు, ఏఐ సిటీ, ఫ్యూచర్‌ సిటీ అందులోనే కట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు.

‘ఫ్యూచర్‌ సిటీ 14వేల ఎకరాలు పెట్టుకొని.. ప్రసుత సిటీను ఎందుకు ఖరాబ్‌ చేస్తున్నవ్‌. అక్కడ ఉన్నదే లంగ్స్‌ స్పేస్‌ ఇది ఒకటి. పశ్చిమ హైదరాబాద్‌లో ఒకే ఒక లంగ్స్‌ స్పేస్‌ని ఎందుకు పాడు చేస్తున్నావని ప్రజలు అడిగేది? పిల్లలు కొట్లాడేది? అక్కడనున్న జంతువులకు నోరు లేదు. నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికీ బాధ అనిపించడం లేదా? నెమళ్లు అరుస్తుంటే.. పక్షులు మా గూడు చెడగొట్టదని ఏడుస్తుంటే.. దేశం మొత్తం వినపడుతుంది కానీ.. మీకు వినిపించడం లేదు. రేవంత్‌రెడ్డికి చెప్పేది ఒక్కటే. యూనివర్సిటీ అని.. రియల్‌ ఎస్టేట్‌ కాదని పిల్లలు ఇస్తున్నరు. దానిపై ప్రెస్‌మీట్లు, ఇష్టం వచ్చిన తిట్లపై చెప్పేందుకు రాలేదు. సూటిగా, స్పష్టంగా ఒకే విషయం చెబుతున్నాం. మళ్లీ మమ్మల్ని ఎవరూ తప్పుపట్టొద్దని కోరుతున్నాం’ అన్నారు.

‘మా పార్టీ పెద్ద కేసీఆర్‌ నిన్నా, మొన్న మా పార్టీ సమావేశాలు జిల్లాల వారీగా జరుగుతున్నయ్‌. నిన్న ముఖ్య నేతలను కేసీఆర్‌ పిలిచారు. పిల్లలు ఆందోళన చేస్తున్నరు.. ఏ స్టాండ్‌ తీసుకుంటే బాగుంటుందని కేసీఆర్‌ చర్చించారు. మేమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని వెల్లడించేందుకు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. మేం అనుకున్నది ఏంటంటే.. హైదరాబాద్‌లో ఈ రోజు కాదు.. మా ట్రాక్‌ రికార్డ్‌ చూస్తే.. కొత్తగా పర్యావరణ ప్రేమికులం కాలేదు. కొత్తగా ఏమీ మాట్లాడడం లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులవల్ల ప్రపంచంలో పారిస్‌, బొగొటా నగరాలను తలదన్ని గ్రీన్‌ సిటీ అవార్డును కూడా 2022 బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాధించిపెట్టింది. హరిత విప్లవం సృష్టించింది తెలంగాణ అని చెప్పి ఆ నాడు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రశంసించింది. మిషన్‌ కాకతీయ, హరితహారం కార్యక్రమాలతో అద్భుతాలు సృష్టించిందని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాశాయి’ అని గుర్తు చేశారు.

మా హయాంలో 7.7శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగింది..

‘7.7శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగిందని కేసీఆర్‌ ప్రభుత్వంలో అని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇచ్చిన నివేదిక ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌లో ముఖ్యమంత్రి గారు చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించి ప్రభుత్వం మాది. ఒక పదేళ్లలో భారత్‌లో ఏ మెట్రోనగరంలో గ్రీన్‌ కవర్‌ పెరిగిందంటే.. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్ట్‌ డేటా ముంబయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో చూస్తే హైదరాబాద్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం అత్యధికంగా గ్రీన్‌ కవర్‌ పెంచిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. భారత్‌లోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్‌ కవర్‌ పెరిగిందంటే.. తెలంగాణలో పెరిగిందని పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది.

తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలలో.. 19,472 పల్లెల ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్‌. పల్లెల్లో పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం. మండల స్థాయిలో 6298 ఎకరాల్లో 2011 బృహత్‌ ప్రకృతి వనాలు పెట్టిందని నాటి కేసీఆర్‌ ప్రభుత్వం. హైదరాబాద్‌ చుట్టూ 108 అర్బన్‌ లంగ్స్‌ స్పేసెస్‌ క్రియేట్‌ చేశాం. లక్షపైచీలుకు పంచాయతీరాజ్‌ రహదారులపై అవెన్యూ ప్లాంటేషన్‌ జరిగింది. ఆర్‌అండ్‌బీ మల్టిపుల్‌ అవెన్యూ ప్లాంటేషన్‌ జరిగింది. ప్రతి ఊరిలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మున్సిపాలిటీలతో 15వేల నర్సరీలు ఉన్నయి. 290 మొక్కలు నాటిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అది మా కమిట్‌మెంట్‌. కొత్తగా ఇవాళ పర్యావరణంపై మాకు కొత్తగా కితాబులు అవసరం లేదు’ అన్నారు.