ఇంటి పేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు

ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ప్రకృతి ప్రేమికుడి మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రపంచ పర్యావరణం కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు.

అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావని పునరుద్ఘాటించారు. పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

పర్యావరణ హితుడు రామయ్య : సీఎం రేవంత్‌ రెడ్డి

పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కోటి మొక్కలు నాటి వనజీవినే తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య. ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మారన్నారు. వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్నే ప్రభావితం చేశారన్నారు. ఆమర సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటని చెప్పారు. పర్యావరణ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.