
చాలా రంగాల్లో దేశంలో నెంబర్ వన్ గా రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ.. మొక్కల పెంపకంలోనూ మొదటిస్థానంలో నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ ఇటీవల గణాంకాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొక్కల పంపకం, అటవీ పునరుజ్జీవనం, అటవీ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతేక చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ సంరక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నాయని మంత్రి తెలియజేశారు. హరిత తెలంగాణ సాధన లక్ష్యసాధనకు చేరువలో ఉన్నామనీ.. అధికారులు, సిబ్బంది మరింత కష్టపడి ఆ దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో అటవీ పునరుజ్జీవనంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు ఈ సందర్బంగా మంత్రి వెల్లడించారు. హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా సత్ఫలితాలు ఇస్తోందన్నారు మంత్రి.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటుదాం
హరిత తెలంగాణకై విశేష కృషి చేస్తోన్న ప్రకృతి ప్రేమికుడు, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు(ఫిబ్రవరి 17) సందర్బంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, సంరక్షించాలని మంత్రి ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కలు నాటి కానుకగా ఇద్దామని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ సీఎం జన్మదినాన కనీసం ఒక మొక్కనాటి ఆయనకు, ప్రకృతికి బహుమతిగా ఇద్దామని పిలుపునివ్వడం ప్రశంసనీయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.