అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఎఫ్‌వో రవీందర్‌ రెడ్డి

 అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా 14 నుండి కొనసాగిన అగ్ని మాపక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా చేవెళ్ల ఫైర్‌స్టేషన్‌ ఎస్‌ఎఫ్‌వో రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలపైన ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలన్నారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా నివాసాల్లో విద్యుత్‌ పరికరాలకు నిప్పంటుకుంటే దానిని నీటితో ఆర్పవద్దని, వెంటనే కరెంటు ఆఫ్‌ చేయాలన్నారు.

ఇంట్లోని పిల్లలను గ్యాస్‌ స్టవ్‌కు దూరంగా ఉంచాలని ఎస్‌ఎఫ్‌వో రవీందర్‌ రెడ్డి సూచించారు. ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా వెంటనే 101కి ఫోన్‌ చేసి అగ్ని ప్రమాద సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫైర్‌మెన్స్‌, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.