తెలంగాణలో క్రషర్ల ఇష్టారాజ్యం..!

  • ధనార్జనే ధ్యేయంగా కంకర దందా
  • తెలంగాణలో ధ్వంసమవుతున్న చెరువులు, కుంటలు
  • మట్టి, రాళ్లు చెరువులలో వేస్తున్న వైనం
  • కనుమరుగు దిశగా చెరువులు, కుంటలు
  • ఇంత జరుగుతున్నా మైనింగ్, పీసీబీ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు..?
  • తినే ఆహారంలో కూడా క్రషింగ్ పౌడర్
  • తెలంగాణ వ్యాప్తంగా ఊపిరితిత్తుల సమస్యతో ఎంతో మంది మృత్యువాత

ఒక వైపు దంచి కొడుతున్న ఎండలు, మరోవైపు తాగు నీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు తమ గ్రామ చుట్టుపక్కల్లో ఉన్న చెరువులు, కుంటలు, అలుగులు నీటితో నిండుకుని ఉంటేనే అక్కడి రైతులకు సకాలంలో పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వేసవికాలంలో భూగర్భ జలాలు కూడా అడుగంటకుండా, నీటి సమస్య తలెత్తకుండా ఉండే అవకాశం లేకపోలేదు. కానీ వీటికి పూర్తి విరుద్ధంగా కొందరు అసైన్డ్ భూముల్లో అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఏర్దనూరు గ్రామ శివారులో గల 231 సర్వే నంబర్ లో కొన్ని క్రషింగ్ యాజమాన్యాలు చేస్తున్న ఆగడాలపై ప్రత్యేక కథనం.

సర్వే నంబర్ 231లో గల విసాండ్ అగ్రిగేట్స్, బ్లూ రాక్ క్రషర్స్ యాజమాన్యాలు తూముకుంట, కమ్మరోని కుంటలను ఆక్రమించి యథేచ్ఛగా క్రషింగ్ పనులు చేస్తున్నారు. క్రషింగ్ చేయగా వచ్చిన మట్టిని, రాళ్లను పక్కనే ఉన్న చెరువులు, కుంటలు, కాలువల్లో వేసి అవి పూర్తిగా కనుమరుగయ్యే విధంగా పసులు సాగిస్తున్నారు. అయితే ఈ చెరువు, కుంటలను ఆధారంగా చేసుకుని అక్కడ జీవిస్తున్న మత్స్యకారులు, ఇతర రైతులకు ఆ వైపు వెళ్లడానికే జంకుతున్నారు. ఎక్కడ బ్లాస్టింగ్ చేసిన రాళ్లు తమ మీద పడి ప్రాణాలు పోతాయో అంటూ భయంతో బ్రతుకుతున్నారు. చెరువులోని చేపలు పట్టడానికి కూడా మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

పంటలు పండించుకోలేక…
ఏర్దనూరు గ్రామ శివారులో తూముకుంట, అల్లికుంట అనే రెండు కుంటలు ఉన్నాయి. అయితే తూముకుంట వచ్చేసి 6.20 ఎకరాల విస్తీర్ణంలో ఉండి దీని ద్వారా 50 ఎకరాల పంటలు పండించుకునే అవకాశం ఉండేది. అలాగే అల్లికుంట ద్వారా దాదాపు 100 ఎకరాలు పంటలు పండించుకునే అవకాశం ఉండగా, ఈ రెండు కుంటలు కబ్జాకి గురి కావడం ద్వారా మొత్తం 150 ఎకరాల పంటలు పండించే అవకాశాన్ని ఇక్కడి రైతులు కోల్పోయితున్నట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కుంటలలో మిగిలి ఉన్న నీటిని క్రషింగ్ యాజమాన్యాలు తమ బ్లాస్టింగ్ కు ఉపయోగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుంటలను కబ్జా చేస్తూ దానిపైన రోడ్లు కూడా యథేచ్ఛగా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ బ్లాస్టింగ్ ద్వారా గ్రామస్తులు తినే ఆహారంలో కూడా ఆ పౌడర్ పడి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి ద్వారా ఊపిరితిత్తుల సమస్యలతో గతంలో ఇదే గ్రామానికి చెందిన బాలమణి, రాజు, ఎల్లయ్యలు చనిపోగా వారి కుటుంబాన్ని ప్రభుత్వం నేటికీ అదుకోలేదని స్థానికులు వాపోతున్నారు.

పేరుకే ప్రజాభిప్రాయ సేకరణ..
ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో క్రషింగ్ కోసం చేసే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పేరుకు మాత్రమే మిగిలిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామస్తులు తెలిపినా ఏ ఒక్క సమస్యను కూడా తీర్చడంలో అటు అధికారులు గానీ, ఇటు క్రషర్ యాజమాన్యాలు కానీ పట్టించుకోవడం లేదు, క్రషింగ్ యాజమాన్యాలు తమ అనుమతులు పొందిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక్కడే ఏండ్లుగా ఉండి సొంత గ్రామంలో బతుకుతున్న తమకి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకరమని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత శాఖల అధికారుల్లో మౌనం..
ఈ క్రషింగ్ యాజమాన్య ఆగడాల వలన కలిగే ఇబ్బందులను గ్రామస్తులు గతంలో పలుమార్లు సంబంధిత శాఖలై పిసిబి, మైనింగ్ అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా, అసైన్ భూముల్లో కబ్జాలు చేస్తూ, కుంటలను నాశనం చేస్తున్న సంబంధిత క్రషర్ యాజమాన్యాలపై ఇప్పటికైనా అధికారులు మౌనం వీడి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.