ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలకు పాల్పడినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వైద్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడిన హాస్పిటళ్లను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా వద్ద గల హిరణ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు.
ఈ ఆస్పత్రులను నిర్వహిస్తున్న యాజమాన్యం గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి తప్పుడు బిల్లులతో అవకతవకులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వైద్యశాఖ ఈ అంశంపై విచారణ చేపట్టింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉప వైద్యాధికారి గీత, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఆస్పత్రులను సీజ్ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధిలో తప్పుడు బిల్లులతో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.