రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన ధరణి చట్టం ఒక కుటుంబానికే పనికివచ్చిందన్నారు. భూభారతి చట్టం జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. తహసీల్దార్ స్థాయి అధికారే వచ్చి రూపాయి ఖర్చు లేకుండా రైతుల సమస్యలు పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల దరఖాస్తుదారులందరికీ పట్టాలు ఇస్తామన్నారు. భూభారతి చట్టం పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడంలో అధికారులు బాధ్యత వహించాలన్నారు.
