- రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు
- ఐఎఎస్, ఐపిఎస్‌లు బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని పిటిషన్
- తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లావాదేవీలు జరపవద్దని ఆదేశం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న పిటిషన్‌ను విచారించిన హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. ఈ భూముల్లో అక్రమాలు జరిగాయని, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని స్పష్టం చేసింది. ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వం తో పాటు ఇడి, సిబిఐ, పిటిషన్లో పేర్కొన్న అధికారులు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. మహేశ్ అనే వ్యక్తి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భూదాన్ బోర్డుకు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాలంటే సిబిఐ లేదా ఇడి వంటి స్వతం త్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ అం శంపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు.
తదుపరి విచారణను హైకోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయనే అభియోగాలపై విచారణకు ముగ్గు రు సభ్యులతో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, రఘునందన్‌రావు, శశాంక్‌లతో కమిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పింది. నాగారం గ్రామంలోని సర్వే నెం.181,182లో 103.22 ఎకరాల భూదాన్ భూముల అక్రమాలపై కూడా అదే కమిటీ విచారిస్తున్నదని గతంలోనే హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది.
ఐఏఎస్, ఐపీఎస్‌లకు నోటీసులు
ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీసీఎల్ఏతోపాటు సీబీఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాళ్ల కుటుంబసభ్యులకు, ఇతర అధికారులకు కూడా నోటీసులు జారీచేసింది.
ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు నవీన్ మిట్టల్, జ్ఞానముద్ర (సోమేశ్‌కుమార్ భార్య), పావనీరావు (రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్‌రావు భార్య), ఐశ్వర్యరాజు (ఈ వికాస్‌రాజు భార్య), వసుంధర సిన్హా, ఏకే మొహంతి, ఓం అనిరుధ్ (ఐపీఎస్ అధికారి రాచకొండ కమిషనర్ కొడుకు), నందిన్మాన్ (ఐపీఎస్ విక్రమ్‌సింగ్‌మాన్ భార్య), రీటా సుల్తానియా (ఐఏఎస్ సందీన్సుల్తానియా భార్య), రాధిక (ఐపీఎస్ కమలాసన్‌రెడ్డి భార్య), నితేశ్‌రెడ్డి (మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కొడుకు), ఐపీఎస్ అధికారులు మహేశ్ భగవత్, సౌమ్యా మిశ్రా, స్వాతి లక్రా, రవి గుప్తా, తరుణ్‌జోషి, తోట శ్రీనివాసరావు, సుబ్బారాయుడు, రాహుల్ హెగ్డే, రేఖా షరాఫ్ (ఐపీఎస్ ఉమేశ్‌షరాఫ్ భార్య), రేణుగోయల్ (డీజీపీ జితేందర్ భార్య), దివ్యశ్రీ (ఐఏఎస్ ఆంజనేయులు భార్య), హేమలత (ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి భార్య), ఇందూరావు కే (ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్య), సవ్యసాచి ప్రతాప్‌సింగ్ (ఐపీఎస్ గోవింద్‌సింగ్ కొడుకు), రాహుల్ (రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్‌రెడ్డి కొడుకు), వరుణ్ (ఐపీఎస్ విశ్వప్రసాద్ కొడుకు), రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ, ఐఏఎస్‌లు అమోయ్‌కుమార్, రాజశ్రీ హర్ష, అజయ్‌జైన్, ఇతర అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను వారందరికీ అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు.
నిషేధిత జాబితాలోకి భూములు
వాదనల తర్వాత హైకోర్టు.. నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన్ బోర్డుకు చెందినవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారి ప్రయోజనాల రక్షణల్లో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉంటుందని సందేహం వ్యక్తంచేసింది. కాబట్టి తమకున్న విచక్షణాధికారాలను వినియోగించి ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు సర్వే నం. 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిలా కలెక్టర్, సబ్రిజిస్ట్రార్లకు ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు ప్రకటించింది. తిరిగి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ భూముల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని షరతు విధించింది.
భూదాతల అభీష్టానికి అనుగుణంగా అవి వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే వినియోగించేందుకు పేదలకు కేటాయించవచ్చని పేర్కొంది. లేనిపక్షంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు ప్రజాఅవసరాలకు, బలహీనవర్గాల ఇండ్ల నిర్మాణానికి వాడుకోవచ్చునని తెలిపింది. భూదాన్ నిబంధన 3 ప్రకారం కేటాయింపులు వారసత్వంగా ఇవ్వవచ్చనని కూడా పేర్కొంది. అంతేగాని అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూన్ ఒకటికి వాయిదా వేసింది.