తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు (1991) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో రామకృష్ణారావు మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రామకృష్ణారావు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈయన తన సర్వీసులో నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా, 2016 నుంచి ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. 2021 నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న కుడ్లిగి రామకృష్ణారావు మే ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడతారు. ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.
