- శామీర్ పేట ఎస్సై పరశురాం అతి తెలివి
- రూ.2 లక్షలు లంచం తీసుకుని మరో రూ.22 వేల కోసం కక్కుర్తి
- మాటు వేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు
పోలీసు కేసు నుంచి తప్పించేందుకు రూ.2.22 లక్షలు లంచం వసూలు చేసిన శామీర్ పేట ఎస్సై ఎం. పరశురాం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న శామీర్ పేట పరిధిలో రూ.2.42 లక్షల విలువైన నూనె డబ్బాల చోరీ జరిగినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సూర్య, అఖిలేశ్ అనే వ్యక్తులు నూనె డబ్బాలు కొట్టేసినట్లు తేల్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై పరశురాం నూనె డబ్బాలు కొనుగోలు చేసిన వ్యక్తిని ఈ నెల 20న పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు. నిందితుడిగా చేరుస్తామని బెదిరించి రూ.2 పైగా లక్షల లంచం డిమాండ్ చేశారు. భయపడ్డ బాధితుడు మరుసటి రోజే రూ.2 లక్షలు పోలీస్ స్టేషన్ బయట ఎస్సై కారులో పెట్టి వెళ్లిపోయాడు. అనంతరం ఎస్సై పరశురాం బాధితుడికి మళ్లీ ఫోన్ చేసి రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 23న బాధితుడు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు సమాచారం ఇచ్చాడు. వారి పథకం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు శామీర్ పేట పోలీస్ స్టేషన్ బయట ఉండి బాధితుడిని డబ్బుతో లోపలికి పంపారు. బాధితుడిని చూసిన ఎస్సై పరశురాం లంచం డబ్బును చెత్త డబ్బాలో వేసి వెళ్లిపోవాలని చెప్పాడు. బాధితుడు అలాగే చేసి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే ఎస్సై పరశురాం డబ్బు కట్ట బయటకు తీసి లెక్కబెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.