- 4 నెలలో నలుగురు మృత్యువాత..
- పేలుళ్ళ దాటికి ఛిద్రమవుతున్న శరీరాలు.. రోడ్డున పడుతున్న కుటుంబాలు..
- భద్రత ప్రమాణాలకు తిలోదకాలు.. పట్టించుకొని అధికారులు..
- ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కు కూలీల బతుకులంటే విలువే లేదా..?
- మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అధికారులు..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలాగా మారిపోయాయి. ఈ 2025 సంవత్సరంలోనే పెద్ద కందుకూరు ప్రీమియర్ పరిశ్రమలో పేలుడు సంభవించి ఒక కార్మికుడు మృత్యువాత చెందగా, కాటేపల్లి పరిశ్రమలో మంగళవారం జరిగిన ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందడం పట్ల పరిశ్రమలోని తోటి కార్మికులు, వారి కుటుంబ సభ్యులలో తీవ్ర ఆవేదన, భయం నెలకొంది. పరిశ్రమలోని కార్మికుల భద్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వారు పనిచేసే సామాగ్రి గురించి శిక్షణ ఇస్తున్నారా లేదా? అనే ప్రశ్నతో పాటు కార్మికుల భద్రత కోసం యాజమాన్యం తీసుకుంటున్న భద్రతా చర్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు కూడా గాలికి వదిలేస్తున్నారు అని వాపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అధికారుల పనీతీరు అస్తవ్యస్తంగా తయారయ్యింది.. పరిశ్రమలలో ఉన్న లోపల కారణంగా తరుచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం వారి అసమర్ధతకు పరాకాష్టగా మారింది.. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..వాటి నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యంగానే చెప్పవచ్చు.. కనీసం ప్రమాదాలపై సమీక్షలు జరిపిన దాఖలాలు మచ్చుకైనా లేవు.. పరిశ్రమలను సందర్శించి భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టవలసిన ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు తూ.. తూ.. మంత్రంగా విధులను నిర్వర్తించడం వలన ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.. పరిశ్రమలను సందర్శించకుండానే అధికారులు ఇష్టానుసారంగా సందర్శించినట్లు రాసుకొని కార్యాలయంలోనే పరిశ్రమల యజమాన్యాలకు ధృవీకరణ పత్రాలు ఇస్తున్నట్లు సమాచారం .. అదే సమయంలో వసూళ్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లు మామూళ్ల మత్తులో ఊగుతున్నారని చెప్పుకుంటున్నారు.
పెద్ద కందుకూరు కాటేపల్లి గ్రామాలలో నెలకొల్పిన ఈ పరిశ్రమలలో ప్రమాదాలు నిత్యకృత్యంగా జరుగుతున్నాయి. మృతిచెందిన కార్మికుల కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొనగా, గాయపడి కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కార్మికుల కుటుంబాలలో సైతం తీవ్ర ఆవేదన నెలకొంటుంది. పేలుడు తయారీ పదార్థాల పరిశ్రమ కావడంతో గాయపడిన కార్మికులు మాటలకు అందని రీతిలో తీవ్రస్థాయిలో వేదనను అనుభవిస్తున్నారు. కేవలం 2025 సంవత్సరంలో గడిచిన 4 నెలలలో రెండు పరిశ్రమలలో కలిపి ఏకంగా నలుగురు కార్మికులు మృత్యువాత చెందడంతో పరిశ్రమలో పనిచేసే కార్మికులతో, పాటు చుట్టుపక్కల ప్రదేశాలలో సైతం తీవ్ర భయాందోళన నెలకొంది. కార్మికుల భద్రతపై ఇటు పరిశ్రమ యాజమాన్యంతో పాటు జిల్లాలోని సంబంధిత శాఖ అధికారులు సైతం తగు చర్యలు చేపట్టకపోవడంతోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా..?
కేవలం ఈ సంవత్సరంలోనే రెండు ఘటనలు చోటు చేసుకోవడంతో పరిశ్రమలోని కార్మికుల భద్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వారు పనిచేసే సామాగ్రి గురించి శిక్షణ ఇస్తున్నారా లేదా? అనే ప్రశ్నతో పాటు కార్మికుల భద్రత కోసం యాజమాన్యం తీసుకుంటున్న భద్రతా చర్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారంతో సరిదిద్దుకునే పరిశ్రమ యాజమాన్యం అసలు కార్మికుల బాధ్యతకు ఎలాంటి చర్యలు చేపడుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మృత్యువాత పడుతున్న కార్మికులు…
గత మూడు నెలల క్రితమే యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు పరిశ్రమలో సైతం ఇదే తరహాలో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ పేలుడు సంఘటనలు సైతం ఒక కార్మికుడు మరణించగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా కాటేపల్లి పరిశ్రమలో పేలుడు దాటికి ముగ్గురు కార్మికులు మృత్యువాత చెందగా, మరి కొంతమంది కార్మికులు తీవ్రస్థాయిలో గాయపడి చికిత్స పొందుతున్నారు. పెద్దకందుకూరు పరిశ్రమ ప్రారంభమైన నాటి నుంచి ఈ పరిశ్రమలో మూడుసార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2012లో స్లాబ్ కూలి ఇద్దరు చనిపోగా, 2019లో పేలుడు సంభవించి ఒకరు మరణించారు. తిరిగి జనవరిలో పేలుడు సంబంధించి మరొకరు మృతి చెందారు. ఇలా సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికుల భద్రత కోసం తీసుకునే చర్యలపై అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రపు భద్రతా చర్యలు తీసుకోవడం వల్లనే ఇట్లాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి మృతదేహాల వెలికితీత…
తీవ్రస్థాయిలో నెలకొన్న పేలుడు ధాటికి శిథిలాల కింద పడి మృత్యువాత చెందిన ఇద్దరు మృతదేహాలను మంగళవారం అర్థరాత్రి వెలికి తీసి భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద సమయంలో అందులో మృతి చెందిన కార్మికులు అందులోనే పనిచేస్తున్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. పేలుడు దాటికి భవనం మొత్తం కుప్పకూలిపోయిందంటే ఇంతటి భారీ స్థాయిలో విస్పోటనం జరిగిందనే విషయాన్ని ఊహించుకొని తోటి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. తమతో పాటు కలిసి పని చేసిన కార్మికుల మృతదేహాలు శిథిలాల కింద పడి ఉండడం చూసిన కార్మికులు తీవ్రవేదనకు గురయ్యారు.
మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం
పేలుడు దాటికి మృతి చెందిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ. ఒక కోటి రూపాయల ఆర్ధిక సహాయంతో పాటు ఇతర ఇన్సూరెన్స్ అలవెన్స్ లో ఏమైనా ఉంటే కూడ అదనంగా ఇస్తామని, కుటుంబంలో ఒకరికి కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులకు పూర్తిస్థాయిలో ఆసుపత్రి ఖర్చులను పరిశ్రమ భరిస్తుందని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు.